గుడ్ న్యూస్: ఆగస్టు 22 లోపు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..?

గుడ్ న్యూస్: ఆగస్టు 22 లోపు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..?
  • 22 తర్వాత శుభదినాలు కావు.. మిస్సయితే దసరా వరకు ఆగాల్సిందే!
  • ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సెగ్మెంట్ లో ప్రారంభించనున్న సీఎం?
  • పలుచోట్ల చురుకుగా కొనసాగుతున్న నిర్మాణం

హైదరాబాద్:  ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  చెప్పనుంది. ఈ నెలాఖరు నాటికి ఇండ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం  సిద్ధమవుతోంది. ఈ నెల 22తో శ్రావణ మాసం పూర్తవుతుంది. 23 వ తేదీ  నుంచి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. సహజంగా భాద్రపద మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో శుభకార్యాలు చేయరు. దీంతో శ్రావణమాసంలోనే పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఖమ్మం జిల్లా అశ్వారావు పేట సెగ్మంట్  పరిధిలోని చండ్రుగొండ మండలంలో సుమారు యాభై గృహాల నిర్మాణం పూర్తయిందని, వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు  సమాచారం.  ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలను నిర్మించాలని సంకల్పంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. 

ఎలాంటి అక్రమాలు జరగకుండా కమిటీలు వేసింది. నిర్మాణం ప్రారంభించిన ప్రదేశం వివరాలను యాప్ లో పొందు పర్చింది. వాటికి జియో ట్యాగింగ్ కూడా చేసింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా అనేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన ఇసుకను కూడా ప్రభుత్వం ఉచితంగా అందించింది. దీంతో నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల చివరదశకు చేరుకోగా మరికొన్ని చోట్ల పూర్తయ్యాయి. వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం.