ఇందిరమ్మ ఇండ్ల సాయం రూ.4 వేల కోట్లు : ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల సాయం రూ.4 వేల కోట్లు : ఎండీ వీపీ గౌతమ్
  •     హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సాయం రూ. 4 కోట్లకు చేరిందని హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ప్రస్తుత వారానికి 13, 861 మందికి రూ.152.40 కోట్లను విడుదల చేశామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ ఏడాది మార్చి ఆఖరుకల్లా లక్ష ఇండ్లను పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించుకుని,  క్షేత్ర స్థాయిలో పనులు వేగవంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

ఇంటి నిర్మాణపు పనుల పురోగతిని బట్టి  ప్రతి వారం బిల్లులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2.50 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో సుమారు 1.22 లక్షల ఇండ్లు గోడలు, శ్లాబ్ లు అయ్యాయని, త్వరలోనే పూర్తి కానున్నాయని చెప్పారు. 

మిగిలిన ఇండ్ల పనులు  మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు  ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చామని, కలెక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎండీ గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు ఇవ్వవద్దని, ఎవరైనా అడిగితే 1800 599 5991 నంబర్ కు ఫిర్యాదు చేయాలని ఎండీ గౌతమ్ సూచించారు.