- కొత్తగా మరో 1.72 కోట్ల మీటర్ల క్లాత్ ఆర్డర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ చీరలు ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం రూ.88 కోట్లు జమ చేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు మరో 1.72 కోట్ల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే నేతన్నలు పని ప్రారంభించారు. దీంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికింది.
నేతన్నలు ఉత్పత్తి చేసిన ఇందిరమ్మ చీరల డబ్బులు మ్యాక్స్ సొసైటీలకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. సిరిసిల్లలో 130 మ్యాక్స్ సొసైటీలు ఉండగా, ఇవి 4.34 కోట్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశాయి. ఇందుకోసం సోసైటీలకు రూ.149.22 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.88 కోట్లు రిలీజ్ చేసింది. మిగిలిన అమౌంట్ ను విడతల వారీగా జమ చేయనుంది.
ఇందిరమ్మ చీరల బిల్లులు వెంటనే విడుదల చేయడంతో సిరిసిల్ల నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం 1.72 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇవ్వడంతో తమకు మరో మూడు నెలల పని దొరికిందని పాలిస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆడేపు భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.
