
హైదరాబాద్ (పద్మారావు నగర్), వెలుగు: కొవాగ్జిన్ రెండో డోసు వేయించుకోవడానికి గాంధీ ఆస్పత్రికి వచ్చిన ప్రజలు టీకా స్టాక్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సెంటర్ దగ్గర వెయిట్ చేశారు. మార్చి 15న తొలి డోస్ కొవాగ్జిన్ టీకా తీసుకున్న కొందరు ముసలివాళ్లు 28 రోజుల తర్వాత ఫోన్‌కు మెసేజ్ రావడంతో సోమవారం సెకండ్ డోస్ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో కొవాగ్జిన్ టీకా స్టాక్ అయిపోవడంతో పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశారు. వీళ్లలో చాలా మంది 70 ఏండ్లకు పైబడిన వాళ్లు కావడం.. డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ఆకలితో నీరసించిపోయారు. మధ్యాహ్నం టైమ్‌లో ఓ వృద్ధుడు కళ్లు తిరిగి కిందపడిపోవడంతో వెంటనే గాంధీ వైద్య సిబ్బంది ట్రీట్‌మెంట్ చేశారు. ఓ వైపు సర్కారు ‘టీకా ఉత్సవ్’ పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే మరోవైపు టీకా స్టాక్ లేక తమ లాంటి వేలాది మంది ఇబ్బంది పడుతున్నామని వృద్ధులు వాపోయారు. కొందరువైద్య సిబ్బంది దాదాపు 40 కొవాగ్జిన్ టీకా డోసులను దాచి తమకు తెలిసిన వాళ్లకు ఇచ్చారని కొందరు ఆరోపించారు. కొందరు ముసలివాళ్లు తమకు సెకండ్ డోస్ ఇవ్వట్లేదని అక్కడున్న పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఆరోపణలపై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రానికి మరో 3.62 లక్షల డోసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి 3.62 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయానికి అవి రాష్ర్టానికి చేరుకుంటాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం నాలుగున్నర లక్షల డోసులు ఉన్నాయని, ఇప్పుడు వచ్చేవాటితో కలిపి స్టోరేజ్ 8.12 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ఈ నాలుగైదు రోజులకు ఇవి సరిపోతాయని, ఈ లోపల మరిన్ని వ్యాక్సిన్లు వచ్చే చాన్స్ ఉందని వెల్లడించారు. ఆదివారం 95,169 మందికి, సోమవారం 1,23,622 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు.
అన్నిచోట్లా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలె
మనకే వ్యాక్సిన్లకు కొరత ఉన్నప్పుడు ప్రభుత్వం విదేశాలకు వ్యాక్సిన్ ఎందుకు ఎగుమతి చేస్తోందో అర్థం కావట్లేదు. సెకండ్ డోస్ తీసుకోవడానికి వచ్చిన మాలాంటి సీనియర్ సిటిజన్స్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదు. దేశంలో అన్ని చోట్లా వ్యాక్సిన్ స్టాక్ పెట్టాలి.
- బీఎస్‌ఆర్ మూర్తి, స్వరాజ్య లక్ష్మి దంపతులు, సీతాఫల్ మండి