5వేల మందితో ఇండియా మ్యాప్..ఆకట్టుకుంటున్న డ్రోన్ వీడియా

5వేల మందితో ఇండియా మ్యాప్..ఆకట్టుకుంటున్న డ్రోన్ వీడియా

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అజాదీకా అమృత్ మహోత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులు ఇండియా మ్యాప్ ఆకారంలో మానవహారంగా నిలబడ్డారు. 5వేల మందికిపైగా విద్యార్థులు భారతదేశ చిత్ర పటంలో మానవహారంగా నిల్చుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారు. దివ్య శక్తిపీఠ్‌లోని ‘జ్వాల’ అనే సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 5,335 మంది మానవహారంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని భారతదేశ పటాన్ని  విద్యార్థులు, సామాజిక కార్యకర్తలతో రూపొందించేందుకు ప్రయత్నించామని ‘జ్వాల’ వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య గుప్తా తెలిపారు. భౌగోళిక ఆకృతిలో మానవహారంగా రూపొందించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినట్లు చెప్పారు.  ఇండియా మ్యాప్ సరిహద్దులోనే కాకుండా పటం లోపల కూడా త్రివర్ణ పతాక రంగుల్లో విద్యార్థులను  నిల్చోబెట్టినట్లు తెలిపారు.