న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండియాలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మందగించింది. 13 నెలల కనిష్టమైన 0.4 శాతానికి తగ్గింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్ఓ) ప్రకారం, ఫ్యాక్టరీల ఉత్పత్తిని కొలిచే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) కిందటేడాది అక్టోబర్‌లో 3.7 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది అక్టోబర్‌లో కేవలం 0.4 శాతమే పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఐపీ 4.6 శాతం వృద్ధి చెందింది. కిందటి నెలలో ప్రకటించిన 4 శాతం నుంచి ఎన్‌ఎస్‌ఓ సవరించింది.
తాజా డేటా ప్రకారం, అక్టోబర్‌లో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ఉత్పత్తి 1.8 శాతం పెరగగా, కిందటేడాది అక్టోబర్‌లో నమోదైన 4.4% గ్రోత్ నుంచి తగ్గింది. మైనింగ్ ప్రొడక్షన్ 1.8%, పవర్ ప్రొడక్షన్ 6.9 శాతం పడింది. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 2.7 శాతం తగ్గింది. కిందటేడాది ఇదే టైమ్‌లో 4 శాతం వృద్ధి నమోదైంది.
