హైదరాబాద్, వెలుగు: ఇండియా నుంచి వరల్డ్ మోటార్ సైకిల్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐఎం) లైసెన్స్ పొందిన ఏకైక టీమ్ ఇండీ రేసింగ్ తన తొలి ఇంటర్నేషనల్ ఈవెంట్‌లోనే సత్తా చాటింది. ఎఫ్‌ఐఎం ఈ–ఎక్స్‌పోరర్ వరల్డ్ కప్ రెండో సీజన్ ఆరంభ రేసులోనే పోడియంపైకి వచ్చింది. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన తొలి రౌండ్ రేసులో సాండ్రా గోమెజ్, ఇండియా సంతతికి చెందిన స్పెన్సర్ విల్టన్‌తో కూడిన ఇండీ రేసింగ్ టీమ్ 121 పాయింట్లతో థర్డ్ ప్లేస్ సాధించింది.
జపనీస్ హోండా రేసింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌సి) 132 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా, రాబీ మాడిసన్ రేసింగ్ టీమ్ 131 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. వరల్డ్ కప్ అరంగేట్రంలోనే తమ జట్టు పోడియం ఫినిష్ చేయడం ప్రపంచ వేదికపై ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌కు ముఖ్యమైన, చారిత్రాత్మక మైలురాయి అవుతుందని ఇండీ రేసింగ్ ఓనర్ కె. అభిషేక్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ వరల్డ్ కప్‌లో రెండో రేసు మేలో నార్వేలో జరుగుతుంది. నవంబర్ చివర్లో జరిగే సీజన్ ఫైనల్ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
