బోట్​హౌస్​లకు చిరునామా

బోట్​హౌస్​లకు చిరునామా

ఇనే... ఓ ప్రశాంతమైన మహా సముద్రానికి, ఎత్తైన కొండకోనలకు మధ్య ఆనుకుని ఉన్న ఒక చక్కని గ్రామం. ప్రపంచంలోని అత్యంత అందమైన గ్రామాల్లో ఇది ఒకటి. నడవడానికి రోడ్డు లేదు. వెహికల్ సౌకర్యాలు ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా బోట్​ ఎక్కాల్సిందే. మరి అక్కడ ఉండే ప్రజల లైఫ్​ స్టైల్​ ఎలా ఉంటుందో? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

ఇనే గ్రామం.. జపాన్‌‌‌‌లోని అత్యంత అందమైన గ్రామాల్లో ఒకటి. పర్వతాలకు సముద్రానికి మధ్య ఎక్కువ స్థలం లేకపోయినా ప్రజలంతా కలిసి ఈ గ్రామాన్ని సృష్టించారు. దీన్ని చూస్తే ‘ఎడో’ కాలం గుర్తుకువస్తుంది. 
జపాన్, నీటి వెంట ఇతర పట్టణాలను నిర్మించినప్పటికీ, ప్రకృతి వాటిని తుడిచిపెట్టింది. ఎందుకంటే అక్కడ భూకంపాలు, సునామీలు ఎక్కువ. మరీ ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని మీటర్ల ఎత్తులో ఎగసి పడే అలలు భయపెడతాయి. కానీ... ఇనే భయపడాల్సిన అవసరం లేదు. దీని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. భౌగోళికంగా, ఇనే దక్షిణ దిశగా ఉంటుంది. అంతేకాకుండా... ఇనే బేకి వెళ్లే దారిలో ‘అయోషిమా’ అని పిలిచే పవిత్రమైన జనావాసాలు లేని ద్వీపం ఉంది. ఇది ఇనే బేను ప్రశాంతంగా ఉంచడానికి సాయపడుతుంది. దాని బోట్​ హౌస్​లు పెద్ద అలల తాకిడి నుంచి కాపాడతాయి.

బోట్​ హౌస్

ఇక్కడ 230 బోట్​ హౌస్​లు ఉన్నాయి. వాటిని స్థానిక భాషలో ఫనాయా అని పిలుస్తారు. కల్చర్​ని కాపాడేందుకు ప్రజలు ఇండ్లతోపాటు బోట్​హౌస్​లను ఏర్పాటుచేసుకుంటారు. వాటిని కూడా ఇళ్లలానే వాడతారు. ఇప్పుడు ఆ హిస్టారికల్ బోట్​ హౌస్​లు చాలా వరకు జపనీస్ సత్రాలు, ఇండ్లు, విచిత్రమైన కేఫ్‌‌‌‌లుగా మారిపోయాయి. అయితే వాటి అసలు డిజైన్​లు అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం ఫిషింగ్ పోర్ట్ కావడంతో ఇనే ప్రజలు ఇప్పటికీ సముద్రంతో కలిసి జీవిస్తున్నారు. అయితే అదే ఇక్కడి కల్చర్​కి గుర్తింపు తెచ్చింది. బేలో ఉండాలనుకునే టూరిస్ట్​ల కోసం కొన్ని బోట్​ హౌస్​లు ఉన్నాయి. ఇక్కడ  స్థానిక పండుగలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సేక్ (జపనీస్​ రైస్ వైన్) బ్రూవరీ, ప్రపంచంలో ఎక్కడా చూడని అద్భుతమైన వేడుకలను కళ్లకు కడుతుంది. ఈ ఊరిని చూడాలంటే కాలినడకన వెళ్లాలి. లేదా బైక్ మీద వెళ్తే అక్కడున్నవన్నీ చూడొచ్చు. సిటీలో సైకిళ్లను వాడడం, ఇ–-బైక్ అద్దెలు, టూర్లు, సీ టాక్సీ టూర్​, సాషిమి ఎక్స్​పీరియెన్స్ చేయొచ్చు. ఇనేలో లోకల్​గా లభించే పదార్థాలలో ప్రత్యేకత కలిగిన అనేక రకాల అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. సముద్రం నుంచి చేపలు, షెల్​ ఫిష్, స్థానికంగా పండించిన వరి, కూరగాయలు గ్రామం బయట ఉన్న పర్వతాల్లో సాగు చేస్తారు.

 సీ కయాకింగ్

సీ కయాక్ ద్వారా ఎక్కువ ఇనే తీరప్రాంతాన్ని చూడొచ్చు. సమీపంలోని గుహలు, ప్రత్యేకమైన అగ్నిపర్వత రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఇది సంప్రదాయకంగా చాలా మంది ప్రజలు తమ పొరుగువారిని కలవడానికి ప్రైవేట్ బోట్ల ద్వారా వెళ్ళే మార్గం. నిజానికి ఇక్కడ డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ల కంటే బోటింగ్‌‌‌‌ లైసెన్సులే ఎక్కువ. బే చూడాలంటే  పెద్ద డబుల్ డెక్కర్ బోట్‌‌‌‌ని కూడా తీసుకోవచ్చు. 

ఇ- బైక్ పర్యటన

ఇనేలో ఫనాయా బోట్ హౌస్ గ్రామం లేదా ఇ-–బైక్ టూర్‌‌‌‌తో మంచి ఎక్స్​పీరియెన్స్ చేయొచ్చు. రెండు -గంటల టూర్​లో​ బే ప్రాంతం చూడొచ్చు. నాలుగు -గంటల కోర్సులో విజిటర్స్​ను ఇనే గ్రామీణ ప్రాంతాల్లోని అడవుల్లోకి, కొండల్లో సేంద్రీయ పదార్థాలను ప్రొడ్యూస్​ చేసే రెస్టారెంట్‌‌‌‌లను చూపిస్తారు. ఇనే చాలా చిన్న గ్రామం కాబట్టి, వసతి చాలా పరిమితం. దగ్గర్లోని అమనోహషిడేట్‌‌‌‌లో స్టే చేయొచ్చు. ఇనేలో ఒక రోజు టూర్​ వేయడం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది.

సముద్రంలో జియోన్ ఫెస్టివల్

ఈ సం ప్రదాయ పండుగ 300 సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది. ఇనేలోని యసకా-జింజా మందిరం దగ్గర పారిష్వాసులు అనేవాళ్లు ఉన్నారు. వాళ్లు క్యోటోలోని యసకా -జింజా మందిరం నుంచి గోజు టెన్నో దేవత ఆత్మలో భాగం. ఆచారంలో భాగంగా రవాణాను మొదలుపెట్టారు. చేపలు పట్టడం, సముద్రంలో భద్రత, సమృద్ధిగా పంట పండడం కోసం  ప్రార్థనలు చేస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జులై చివరిలో ఇనే ప్రాంతంలో, ఇనే బే చుట్టూ రెండు రోజుల పాటు జరుగుతుంది. దీన్ని “జియోన్ ఫెస్టివల్ ఆఫ్ ది ఓషన్” అని పిలుస్తారు. 

ఎలా వెళ్లాలి?

విమానంలో క్యోటో వెళ్లి, అక్కడి నుంచి రైలు, బస్సు లేదా కారులో వెళ్లొచ్చు. ఇనేకి15 కిలో మీటర్ల దూరంలో అమనోహషిడేట్‌‌‌‌ ఉంది. రైలు మార్గంలో చేరాలంటే క్యోటో స్టేషన్ నుంచి అమనోహషిడేట్‌‌‌‌ స్టేషన్​కి జె.ఆర్. హషిడేట్ లిమిటెడ్ ఎక్స్​ప్రెస్ రైల్లో వెళ్లాలి. అక్కడి నుంచి గంటకో బస్ ఉంటుంది. సరిగ్గా గంటకు ఇనేకి చేరుకుంటారు. కారులో అయితే, క్యోటో నుంచి ఇనేకి దాదాపు రెండు గంటలు పడుతుంది.