కృష్ణా బేసిన్​కు వరద .. కర్నాటకలోని ఆల్మట్టిలోకి రోజూ 8 టీఎంసీల ఫ్లో

కృష్ణా బేసిన్​కు వరద .. కర్నాటకలోని ఆల్మట్టిలోకి రోజూ 8 టీఎంసీల ఫ్లో
  • మరో 48 టీఎంసీల నీళ్లు అవసరం.. వారంలో నిండే చాన్స్​
  • ఆగస్టు రెండో వారం నాటికి మన ప్రాజెక్టులకూ జల కళ
  • గోదావరి బేసిన్​లోకి ఇంకా మొదలు కాని ప్రవాహం

హైదరాబాద్, వెలుగు: వర్షాల్లేక అల్లాడుతున్న రైతులకు ఊరట కలిగించేలా ఎగువన వరదలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా బేసిన్​లో వరద క్రమంగా పెరుగుతున్నది. కృష్ణా నదిపై కర్నాటకలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టులోకి క్రమంగా ఫ్లో పెరుగుతున్నది. రోజూ సగటున 8 టీఎంసీల చొప్పున ఆల్మట్టికి వరద వస్తున్నది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆల్మట్టిలోకి దాదాపు 12 టీఎంసీల వరద వచ్చి చేరింది. మంగళవారం ఉదయం వరకు ప్రాజెక్టులోకి 60 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. బుధవారం నాటికి 86 వేల క్యూసెక్కులకు పెరిగింది. 

ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 81.44 టీఎంసీల నీళ్ల స్టోరేజీ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు మరో 48 టీఎంసీల నీళ్లు అవసరంకాగా.. వరద ఇలాగే కొనసాగితే మరో వారంలోగా ప్రాజెక్టు నిండే అవకాశాలుంటాయని అధికారులు చెప్తున్నారు. నారాయణపూర్​ కెపాసిటీ 37.64 టీఎంసీలకుగానూ 25.06 టీఎంసీల నిల్వ ఉన్నది. దీంతో ఆల్మట్టి నుంచి ఒకసారి నీటి విడుదల మొదలైతే నారాయణపూర్​ కూడా రెండు మూడు రోజుల్లో నిండే చాన్స్​ ఉంటుందని అంటున్నారు.

ఎగువన వరదలతో చిగురిస్తున్న ఆశలు

ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడం.. వరద పెరుగుతుండడంతో మన ప్రాజెక్టులపైనా ఆశలు చిగురిస్తున్నాయి. వరద ప్రవాహం కొనసాగితే ఆగస్టు రెండు లేదా మూడో వారం నాటికి కృష్ణా బేసిన్​లోని  శ్రీశైలం, నాగార్జునసాగర్​నిండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాల పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నది. ఆ ప్రాజెక్టుకు పెద్దగా వరద ప్రవాహం లేకపోయినప్పటికీ నీటి నిల్వ మాత్రం చెప్పుకునే స్థాయిలోనే ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి కెపాసిటీ 9.66 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 7.72 టీఎంసీల నీళ్లున్నాయి.

అయితే, శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టులు మాత్రం పూర్తిగా వట్టిబోతున్నాయి. సాగర్​నిండేందుకు 191 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రస్తుతం ప్రాజెక్టులో 120 టీఎంసీల నీళ్లున్నాయి. అది కూడా డెడ్​స్టోరేజీలోనే ఉన్నాయి. ఇటు శ్రీశైలంలో 36.66 టీఎంసీల నీళ్లుండగా.. మరో 179.15 టీఎంసీల నీళ్లు అవసరం. ప్రస్తుతం శ్రీశైలానికి 2,256 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తున్నది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టుకూ 27 వేల క్యూసెక్కుల లో ఫ్లో ఉన్నది. ఆ ప్రాజెక్టు నిండేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 105 టీఎంసీల సామర్థ్యానికిగానూ కేవలం 25 టీఎంసీల నీళ్లే ఆ ప్రాజెక్టులో ఉన్నాయి. 

గోదావరి డ్యామ్​లు డల్​

గోదావరి బేసిన్​లో మాత్రం ఇంకా వరద ప్రవాహం మొదలు కాలేదు. ఆ బేసిన్​లోని జయక్వాడి, సింగూరు, నిజాంసాగర్​, శ్రీరాం సాగర్​, మిడ్​మానేరు, లోయర్​ మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇంకా ఫ్లో మొదలు కాలేదు. ఆయా ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం డెడ్​ స్టోరేజీలోనే నీళ్లున్నాయి. జయక్వాడిలో 102.73 టీఎంసీలకుగానూ 29.23 టీఎంసీలు, సింగూరులో 29.91 టీఎంసీలకుగానూ 13.57, నిజాంసాగర్​లో 17.80 టీఎంసీలకుగానూ 3.10, శ్రీరాంసాగర్​లో 90.31 టీఎంసీలకుగానూ కేవలం 12.32 టీఎంసీలు, మిడ్​ మానేరులో 27.50 టీఎంసీలకుగానూ 5.57, లోయర్​ మానేరులో 24.07 టీఎంసీలకుగానూ 5.18, కడెంలో 7.60 టీఎంసీలకుగానూ 3.92, శ్రీపాద ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకుగానూ 4.91 టీఎంసీల స్టోరేజీ ఉన్నది. అయితే, ఇప్పటికే ప్రాణహిత నదిలో వరద ప్రవాహం మొదలైంది.