ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వరుడి కల్యాణం మంగళవారం కమనీయంగా జరిగింది. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 4.00 గంటలకు వీరభద్రుడి వేశధారి అగ్నిగుండం ప్రవేశం చేయగా తదుపరి భక్తులు అగ్నిగుండం దాటారు. అక్కడి నుంచి మొదలైన పూజా కార్యక్రమాలు అమావాస్య భక్తుల మొక్కుల వరకు కొనసాగాయి. సాయంత్రం ఆలయ అర్చకులు సంగమేశ్వరుడి కల్యాణం నిర్వహించారు. ఎంపీ సురేశ్కుమార్షెట్కార్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
దంపతులు రూ.2100 రుసుము చెల్లించి కల్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు కల్యాణ క్రతువు ముగిసిన తర్వాత భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్చంద్రశేఖర్, ఈఓ శివరుద్రప్ప, ధర్మకర్తలు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావు పాటిల్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
