సమాచార కమిషన్ ప్రజల్లో భాగమే : కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి

సమాచార కమిషన్ ప్రజల్లో భాగమే : కమిషనర్  బోరెడ్డి అయోధ్యరెడ్డి
  • దరఖాస్తులను గడువులోగా అధికారులు పరిష్కరించాలి
  • తెలంగాణ సమాచార కమిషనర్  బోరెడ్డి అయోధ్యరెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు : సమాచార కమిషన్​ప్రజల్లో భాగమేనని తెలంగాణ సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారులకు కోరిన సమాచారం అందించాలని సూచించారు. 

హనుమకొండ  కలెక్టరేట్​లో ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులు, సమాచార అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే ఆర్టీఐ ముఖ్యోద్ధేశమని పేర్కొన్నారు. చట్టం పకడ్బందీగా అమలైనప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సద్వినియోగమవుతాయని తెలిపారు. 

సమాచారం ఆలస్యం చేయడమంటే న్యాయం జరగకపోవడమేనన్నారు.  ఇప్పటివరకు 17 జిల్లాల్లో 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు.  మిగతా జిల్లాల్లోనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. 

రాష్ట్రంలో ఆర్టీఐ సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు, వచ్చే మార్చి నాటికి  పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో  కలెక్టర్ స్నేహ శబరీశ్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ ఓ గణేశ్, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.