భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. అమెరికాకు చెందిన రెండు ప్రముఖ సంస్థలు 'ఆప్టిమమ్ హెల్త్‌కేర్ ఐటీ', 'స్ట్రాటస్'లను సుమారు 560 మిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4వేల 600 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో టెక్నాలజీ ఖర్చులు తగ్గుతున్న తరుణంలో.. నిర్దిష్ట రంగాల్లో పట్టు సాధించేందుకు ఇన్ఫోసిస్ వేసిన ఈ అడుగు ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది.
ఈ రెండు ఒప్పందాలలో అత్యంత కీలకమైనది 'ఆప్టిమమ్ హెల్త్‌కేర్ ఐటీ'. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ కోసం ఇన్ఫోసిస్ 465 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. హెల్త్‌కేర్ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఆరితేరిన ఈ సంస్థకు 1,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ విభాగంలో ఈ సంస్థకు ఉన్న నైపుణ్యం ఇన్ఫోసిస్ హెల్త్‌కేర్ విభాగం ఆదాయాన్ని భారీగా పెంచనుంది. ఈ సంస్థ ఆదాయం కేవలం ఏడాది కాలంలోనే 106 మిలియన్ డాలర్ల నుంచి 275 మిలియన్ డాలర్లకు పెరగడం ఇన్ఫోసిస్ ను ఆకర్షించింది.
ఇక రెండో సంస్థ 'స్ట్రాటస్'ను 95 మిలియన్ డాలర్లకు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. న్యూజెర్సీకి చెందిన ఈ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో, ముఖ్యంగా ప్రాపర్టీ అండ్ క్యాజువల్టీ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 450 మంది నిపుణులు కలిగిన ఈ సంస్థ.. గైడ్‌వైర్ సంబంధిత సేవలు, క్లౌడ్ మైగ్రేషన్‌లో ఇన్ఫోసిస్ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.
ఈ రెండు కొనుగోళ్లు 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి పూర్తి కానున్నాయి. పెద్ద డీల్స్ కోసం వేచి చూడకుండా.. లాభదాయకమైన చిన్న, మధ్య తరహా సంస్థలను చేజిక్కించుకోవడం ద్వారా క్లౌడ్, డేటా ప్లాట్‌ఫారమ్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఎదగాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఏఐ యుగంలో మారుతున్న ఐటీ బిజినెస్ మోడళ్ల కారణంగా కంపెనీ ఇలాంటి దారి ఎంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
