ఇన్ఫోసిస్ లాభం రూ. 6,921 కోట్లు... ఏడాది లెక్కన 8.7 శాతం పెరుగుదల

ఇన్ఫోసిస్ లాభం రూ. 6,921 కోట్లు... ఏడాది లెక్కన 8.7 శాతం పెరుగుదల
  • మొత్తం ఆదాయం రూ.42,279 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్​ నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌) ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో  గత సంవత్సరంతో పోలిస్తే 8.7 శాతం పెరిగి రూ. 6,921 కోట్లకు చేరుకుంది. ఇది ఎనలిస్టుల అంచనాలను మించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో ఆదాయం 7.5 శాతం పెరిగి రూ. 42,279 కోట్లకు చేరుకుంది. ఈసారి ఇన్ఫోసిస్ నికర లాభం రూ. 6,778 కోట్లు  ఆదాయం రూ. 41,724 కోట్లుగా ఉంటుందని బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్గ్ బ్రోకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పోల్  అంచనా వేసింది. ఫలితాల ప్రకటనకు ముందు, ఇన్ఫోసిస్ స్టాక్ బుధవారం ఎన్​ఎస్​ఈ లో 0.8 శాతం తగ్గి రూ. 1,558.9 వద్ద ముగిసింది. 

2026 ఆర్థిక సంవత్సరానికి స్థిరమైన కరెన్సీ పరంగా 1–3 శాతం ఆదాయ వృద్ధిని ఆశిస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇది గతంలోని 0–-3 శాతం నుంచి మార్చారు. సంస్థ తన ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్​ను 20–22 శాతం వద్ద కొనసాగించింది. ఈసారి నిర్వహణ లాభం 6.2 శాతం పెరిగి రూ.8,803 కోట్లకు చేరుకోగా, నిర్వహణ మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కొంచెం తక్కువ. ఒక్కో షేరుకు ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.16.70కి చేరుకుంది. ఈ క్వార్టర్​లో ఫ్రీక్యాష్​ఫ్లో విలువ రూ.7,533 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17.7 శాతం తగ్గింది. నికర లాభంలో 108.8 శాతం వాటాకు సమానం.

3.8 బిలియన్​ డాలర్ల విలువైన డీల్స్​

ఈ క్వార్టర్​లో కంపెనీ 3.8 బిలియన్​  డాలర్ల విలువైన పెద్ద ఒప్పందాలపై సంతకం చేసింది. వీటిలో 55 శాతం నికర కొత్తవని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. ఈ పనితీరు తమ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఏఐ సామర్థ్యాల బలానికి రుజువని ఇన్ఫోసిస్​ సీఈఓ,  ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. సంస్థలోని మూడు లక్షల మందికిపైగా ఉద్యోగుల సమష్టి కృషి వల్లే భారీ విజయాలు సాధించామని చెప్పారు. సీఎఫ్​ఓ జయేష్ సంఘ్రాజ్కా మాట్లాడుతూ ఈసారి ఫిక్స్​డ్​ మార్జిన్లు 20.8 శాతం వద్ద ఉన్నాయని చెప్పారు. ఈసీఎస్  ​ఏడాది లెక్కన 8.6 శాతం పెరిగిందని వివరించారు.