
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పూల నరేశ్, ప్రసన్న దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా వీరు అశ్వారావుపేటపేటలోని నరేశ్ బాబు అక్క ఇంట్లో మూడేళ్లుగా నివాసముంటున్నారు. ప్రసన్న ఇంట్లో పనిచేసుకుంటూ జారిపడి గాయాలవగా రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
కానీ.. లక్ష్మీ ప్రసన్న బాగా బలహీనంగా ఎముకల గూడులా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురికి రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించి భర్త కుటుంబ సభ్యులే చంపారని లక్ష్మీ ప్రసన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రసన్న తల్లితండ్రులు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి ప్రసన్న భర్త నరేష్, అత్త విజయలక్ష్మి, నరేష్ అక్క బావ దాసరి భూ లక్ష్మి, దాసరి శ్రీనివాసరావులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి టైంలో అరెకరం పొలం, రెండెకరాల మామిడి తోట, రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం కట్నంగా ఇచ్చామని, రెండేళ్లుగా ఫోన్‌లో కూడా తమ కూతురితో మాట్లాడనివ్వలేదని లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లక్ష్మీ ప్రసన్న బలహీన స్థితిలో చనిపోయి కనిపించడంపై నరేశ్ బాబు బావ వాదన మరోలా ఉంది. ఆమెకు థైరాయిడ్ తో పాటు రక్తహీనత సమస్య ఉందని.. ఆమె తల్లిదండ్రులు చెప్పినవి నిజం కాదని చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఖాన్ పేట గ్రామానికి చెందిన పూల నరేశ్బాబు అనే వ్యక్తితో అదే మండలం ముచ్చారం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న(30)కు 10 ఏండ్ల కింద వివాహమైంది. వారికి ఒక కూతురు ఉంది. ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మూడేండ్ల నుంచి అశ్వారావుపేటలోని నరేశ్ బాబు అక్క దాసరి విజయలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం లక్ష్మీ ప్రసన్న మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్కు తరలించారు.
చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న చనిపోయింది. కానీ ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో మృతురాలి తండ్రి ముదిగుండ్ల వెంకటేశ్వరరావు కూతురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నరేశ్ బాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.