అదరగొడుతున్న ఐపీఓలు..70 శాతం లిస్టింగ్స్ సక్సెస్..పెరుగుతున్న షేర్ల ధరలు

అదరగొడుతున్న ఐపీఓలు..70 శాతం లిస్టింగ్స్ సక్సెస్..పెరుగుతున్న షేర్ల ధరలు

న్యూఢిల్లీ: ఇనీషియల్​పబ్లిక్​ఆఫర్లు​(ఐపీఓ) ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది జులై 25 నాటికి, భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో 26 మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓలు లిస్టయ్యాయి.  వీటిలో సుమారు 18 (దాదాపు 70శాతం) వాటి ఇష్యూ ధరల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. పోస్ట్-లిస్టింగ్ లాభాలు భారీగా ఉన్నాయి. వీటిలో 12 ఐపీఓలు డబుల్ -డిజిట్ లాభాలను నమోదు చేశాయి. 

బలమైన, మంచి ధర కలిగిన ఆఫర్లను పెట్టుబడిదారులు ఇష్టపడుతున్నారు.  దాదాపు 20 ఐపీఓలు ప్రీమియంతో ప్రారంభమయ్యాయి. లిస్టింగ్ రోజున గణనీయంగా లాభాలు వచ్చాయి. తెలివైన పెట్టుబడిదారులు ఐపీఓల ద్వారా భారీ రాబడులను సాధిస్తున్నారని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఈ 26 ఇష్యూల్లో క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌‌‌‌మెంట్స్ అదరగొట్టింది.  

ఫిబ్రవరి 24న ఇది రూ.425 ఇష్యూ ధరతో 9శాతం డిస్కౌంట్‌‌‌‌తో లిస్ట్ అయినప్పటికీ, తదనంతరం   75శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం రూ.737 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ.858 కోట్ల ఇష్యూ సైజుతో వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ ఇన్వెస్టర్ల జేబులు నింపింది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్​కూడా భారీ విజయం సాధించింది. ఇది జనవరి 14న రూ.290 కోట్ల ఇష్యూ సైజుతో లిస్ట్ అయ్యింది. 

ఈ స్టాక్ 53శాతం ప్రీమియంతో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దాని ఇష్యూ ధర కంటే సుమారు 63శాతం ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. ఇది ఈ సంవత్సరం రెండవ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐపీఓగా నిలిచింది. స్కోడా ట్యూబ్స్, ఎల్లెన్‌‌‌‌బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ,  గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఇష్యూ ధరల నుంచి 20శాతం కంటే ఎక్కువ లాభాలను ఇచ్చిన ఇతర ఐపీఓలలో ఉన్నాయి. ఈ లిస్టింగ్‌‌‌‌లను గమనిస్తే బలమైన వృద్ధి సాధిస్తున్న చిన్న, మధ్యతరహా కంపెనీల పట్ల పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది.

నష్టాలు తెచ్చినవీ ఉన్నాయ్​..

అయితే అన్ని ఐపీఓలూ ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని లిస్టింగ్ తరువాత విపరీతంగా తగ్గిపోయాయి. అరిసిన్‌‌‌‌ఫ్రా సొల్యూషన్స్, క్యాపిటల్ ఇన్‌‌‌‌ఫ్రా ట్రస్ట్,  ఇండో ఫార్మ్ ఎక్విప్‌‌‌‌మెంట్ వంటి స్టాక్‌‌‌‌లు వాటి ఇష్యూ ధరల నుంచి 20శాతం పైగా పడిపోయాయి. ఇండో ఫార్మ్ ఎక్విప్‌‌‌‌మెంట్ దాదాపు 30శాతం ప్రారంభ ప్రీమియంతో లిస్ట్ అయినప్పటికీ, ఊపును కొనసాగించడంలో విఫలమైంది. 

పెట్టుబడిదారులకు  నష్టాలను తెచ్చిపెట్టింది.  ఈ ఆర్నెళ్లలో లిస్టింగ్స్​ తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని లార్జ్-క్యాప్ ఐపీఓలు నిధుల సమీకరణలో ఆధిపత్యం చెలాయించాయి. హెచ్​డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ జులై 2, 2025న ఐపీఓకు వచ్చి భారీగా రూ.12,500 కోట్లు సమీకరించింది - ఇది ఈ సంవత్సరం అతిపెద్ద ఐపీఓ. 

ఈ స్టాక్ రూ.740 ఇష్యూ ధరతో రూ.841 వద్ద 14శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యింది, అప్పటినుంచి రూ.865కి పెరిగి, దాని ఇష్యూ ధర నుంచి 17శాతం లాభాన్ని అందించింది. మరో ప్రధాన ఆఫరింగ్ హెక్సావేర్ టెక్నాలజీస్ నుంచి వచ్చింది. ఇది రూ.8,759 కోట్లు సమీకరించింది. ఈ స్టాక్ 8శాతం ప్రీమియంతో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం రూ.867 వద్ద ట్రేడ్ అవుతోంది. 

ఇది దాని ఇష్యూ ధర రూ.708 నుంచి 23శాతం పెరిగింది. అయితే, వ్యక్తిగత ఐపీఓ రాబడులు బాగానే ఉన్నప్పటికీ, 2025లో మొత్తం నిధుల పరిమాణం తగ్గింది. ఇప్పటి వరకు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.45,375 కోట్లు సమీకరించాయి. ఇది 2024 క్యాలెండర్ ఇయర్​లో సేకరించిన రూ.1.60 లక్షల కోట్ల కంటే చాలా తక్కువ. కంపెనీలు ఐపీఓల విషయంలో జాగ్రత్తగా ఉండటమే ఇందుకు కారణం. స్థూల ఆర్థిక అనిశ్చితి, అస్థిర మార్కెట్ పరిస్థితులు,  కఠినమైన రూల్స్​ఈ పరిస్థితికి కారణం కావచ్చు.