రెండు మ్యాచ్‌‌లకు దూరం కానున్న ధవన్

రెండు మ్యాచ్‌‌లకు దూరం కానున్న ధవన్
  • ధవన్‌‌ బొటన వేలుకు ఫ్రాక్చర్‌‌    
  • కోలుకునేందుకు 3 వారాలు!
  • కివీస్​, పాక్​ మ్యాచ్​లకు దూరం​    
  • రీప్లేస్‌‌మెంట్‌‌గా రిషబ్‌‌?

వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియాకు షాక్‌‌. మెగా టోర్నీలో ఇండియా కీలక ప్లేయర్‌‌ సేవలను కోల్పోనుంది.  ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టిన స్టార్‌‌ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌  ఎడమ చేతి బొటనవేలుకు ఫ్రాక్చర్‌‌ అయింది. దాంతో, అతను న్యూజిలాండ్‌‌, పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌లకు దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకునేందుకు మూడు వారాలు పట్టే అవకాశం ఉండడంతో టోర్నీ చివరి దశ వరకూ ధవన్‌‌ అందుబాటులో ఉండేది డౌటే.  అతని ప్లేస్‌‌లో రిషబ్‌‌ పంత్‌‌ను టీమ్​లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  ప్రస్తుతానికైతే మెడికల్‌‌ టీమ్‌‌ అబ్జర్వేషన్‌‌లో ధవన్‌‌ టీమ్‌‌తో పాటు ఇంగ్లండ్‌‌లోనే ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

నాటింగ్‌‌హామ్‌‌ : వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో అద్భుత విజయాలు. ఓపెనర్లిద్దరూ చెరో సెంచరీతో  టచ్‌‌లోకి వచ్చేశారు. కెప్టెన్‌‌ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తున్నాడు. హార్దిక్‌‌, ధోనీ, లోకేశ్‌‌ రాహుల్‌‌ కూడా బ్యాటుతో  రాణిస్తున్నారు. బుమ్రా, భువనేశ్వర్‌‌, చహల్‌‌, కుల్దీప్‌‌ బౌలింగ్‌‌లో సత్తా చాటుతున్నారు. మూడో వరల్డ్‌‌కప్‌‌ నెగ్గడమే టార్గెట్‌‌గా ఇంగ్లండ్‌‌లో అడుగుపెట్టిన టీమిండియాకు  ఆరంభంలోనే ఇలా అన్నీ కలిసొచ్చేశాయి. కానీ, అంత సవ్యంగా సాగుతూ… అందరూ ఖుషీగా ఉన్న  టైమ్‌‌లో అనూహ్య పరిణామం. ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో అదరగొట్టిన శిఖర్‌‌ ధవన్ గాయం కారణంగా  రెండు మ్యాచ్‌‌లకు దూరం కానున్నాడు.  అదే మ్యాచ్‌‌లో పేసర్‌‌ కౌల్టర్‌‌ నైల్‌‌ వేసిన బంతి ధవన్‌‌ ఎడమ చేతి బొటన వేలుకు బలంగా తగిలింది. నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్‌‌ కొనసాగించిన శిఖర్‌‌ ఫీల్డింగ్‌‌కు దూరంగా ఉన్నాడు.  గాయం చిన్నదే అనుకున్నా.. మంగళవారం చేసిన స్కానింగ్‌‌లో ధవన్‌‌ వేలు ఫ్రాక్చర్‌‌ అయినట్టు తేలింది. ఫిజియో ప్యాట్రిక్‌‌ ఫర్హత్‌‌తో కలిసి లీడ్స్‌‌కు వెళ్లిన ధవన్‌‌ అక్కడి స్పెషలిస్ట్‌‌లతో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం న్యూజిలాండ్‌‌తో మ్యాచ్‌‌, ఆదివారం పాకిస్థాన్‌‌తో జరిగే కీలక మ్యాచ్‌‌లో శిఖర్‌‌ బరిలోకి దిగబోడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా  ధవన్‌‌  మిగతా లీగ్‌‌ మ్యాచ్‌‌లకు కూడా అందుబాటులో ఉండేది అనుమానమే.

మళ్లీ ఆడేది ఎప్పుడు?

ప్రాథమిక సమాచారం ప్రకారం ధవన్‌‌ కోలుకోవడానికి గరిష్టంగా మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. కానీ, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ మాత్రం అతను ఎప్పటిలోగా కోలుకుంటాడనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ అబ్జర్వేషన్‌‌లో అతను జట్టుతో పాటే ఇంగ్లండ్‌‌లో ఉంటాడని బోర్డు ట్వీట్‌‌ చేసింది. అతను ఎలా కోలుకుంటున్నాడో చూస్తామని చెప్పింది.  న్యూజిలాండ్‌‌, పాకిస్థాన్‌‌తో ఆడిన తర్వాత ఈ నెల 22న అఫ్గాన్‌‌తో ఇండియా తలపడనుంది. అప్పటిలోపు కోలుకునేందుకు ధవన్‌‌కు 11 రోజులు సమయం ఉంటుంది. ఒకవేళ అఫ్గాన్‌‌ మ్యాచ్‌‌కు ఫిట్‌‌నెస్‌‌ సాధించలేకపోయినా.. ఈ నెల 27న వెస్టిండీస్‌‌తో పోరు వరకు మరో ఏడు రోజుల టైమ్‌‌ లభిస్తుంది. చివరి రెండు లీగ్‌‌ మ్యాచ్‌‌ల్లో (జులై 2న బంగ్లాదేశ్‌‌తో, జులై 6న శ్రీలంక) అయినా ధవన్‌‌ ఆడితే సెమీస్‌‌ ముంగిట జట్టుకు ఉత్సాహం లభిస్తుందని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది.

రీప్లేస్‌‌మెంట్‌‌పై మల్లగుల్లాలు..

ధవన్‌‌    కనీసం నెల రోజుల పాటు బరిలోకి దిగే అవకాశం లేదని తేలితేనే మరో ప్లేయర్‌‌ను ఎంచుకోవాలని సెలెక్టర్లు  భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో తొందరపడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  నిబంధనల ప్రకారం టీమ్‌‌లో  గాయపడ్డ ప్లేయర్‌‌ స్థానంలోనే మరో ప్లేయర్‌‌ను టోర్నీ టెక్నికల్‌‌ కమిటీ అనుమతిస్తుంది. అందువల్ల ఇప్పుడే ధవన్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌ను ప్రకటిస్తే అతను కోలుకున్నాక మళ్లీ టీమ్‌‌లోకి రావడం కొంచెం కష్టమే.  జట్టులో మరో ప్లేయర్‌‌ గాయపడి, సదరు ప్లేయర్‌‌ స్థానాన్ని భర్తీ  చేసేందుకు టెక్నికల్‌‌ కమిటీ ఒకే చెబితేనే శిఖర్‌‌ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పైగా, విజయ్‌‌ శంకర్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌ రూపంలో మిడిలార్డర్‌‌లో ఆడే ఇద్దరు ప్లేయర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. తర్వాతి రెండు మూడు మ్యాచ్‌‌ల్లో వీరిద్దరితో అడ్జస్ట్‌‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.  దీన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు, సెలెక్టర్లు, కెప్టెన్‌‌ ఓ నిర్ణయానికి రావొచ్చు.

టీమ్‌‌కు గట్టి దెబ్బే

శిఖర్‌‌ ధవన్‌‌కు గాయం కావడం టీమిండియాకు కచ్చితంగా గట్టి దెబ్బే.  ఐసీసీ టోర్నీల్లో అతనికి మంచి రికార్డు ఉంది. వరల్డ్‌‌కప్స్‌‌లో ఇప్పటికి ఆడిన పది మ్యాచ్‌‌ల్లో 53.70 సగటుతో 537 రన్స్‌‌ చేశాడంటే అతను ఏ రేంజ్‌‌లో చెలరేగుతాడో చెప్పొచ్చు. పైగా ఇంగ్లండ్‌‌ అతని ఫేవరెట్‌‌ ప్లేస్‌‌.  కొంతకాలంగా పేలవ ఫామ్‌‌లో  ఉన్నా కూడా.. ఇంగ్లిష్‌‌ గడ్డపై అడుగుపెట్టగానే  శిఖర్‌‌  ఫామ్‌‌ అందుకున్నాడు.   ఓపెనర్లుగా ధవన్‌‌–రోహిత్‌‌ హిట్‌‌ పెయిర్‌‌.  ఈ ఇద్దరూ 103 ఇన్నింగ్స్‌‌ల్లో  4681 రన్స్‌‌ జోడించారు.  రోహిత్‌‌తో ధవన్‌‌కు మంచి సమన్వయం ఉంది.  అతను దూరమైతే.. లోకేశ్‌‌తో రోహిత్‌‌  ఏ  మేరకు శుభారంభాలు ఇస్తాడన్నది  ప్రశ్నార్థకమే.

ఇంగ్లండ్‌‌కు పంత్‌‌, రేసులో రాయుడు!

శిఖర్‌‌ గాయం యువ క్రికెటర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ధవన్‌‌ స్థానంలో పంత్‌‌  టీమ్‌‌లోకి వస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ధవన్‌‌ గాయంపై  పూర్తి వివరాలు వచ్చిన వెంటనే రీప్లేస్‌‌మెంట్‌‌ కోసం టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అధికారిక విజ్ఞప్తి చేయనుందని చెప్పాయి. ఆ రీప్లేస్‌‌మెంట్‌‌లో పంత్‌‌ పేరే ఉంటుందని బోర్డు అధికారులు  తెలిపారు. వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌ సెలెక్షన్‌‌ టైమ్‌‌లో సెకండ్‌‌ వికెట్‌‌ కీపర్‌‌గా దినేశ్‌‌ కార్తీక్‌‌, రిషబ్‌‌ మధ్య గట్టి పోటీ నడిచింది. అనుభవజ్ఞుడైన కార్తీక్‌‌కే సెలెక్టర్లు మొగ్గు చూపడంతో పంత్‌‌కు నిరాశ తప్పలేదు. ఇప్పుడు అతడని అదృష్టం వరించేలా ఉంది. ధవన్‌‌ మాదిరిగా పంత్‌‌ కూడా దూకుడుగా బ్యాటింగ్‌‌ చేయలగడు. మిడిలార్డర్‌‌తో పాటు టాపార్డర్‌‌లో కూడా ఆడగల పంత్‌‌  త్వరలోనే లండన్‌‌ చేరొచ్చని సమాచారం. రోహిత్‌‌ శర్మతో కలిసి లోకేశ్‌‌ రాహుల్‌‌ ఓపెనర్‌‌గా వస్తే.. నాలుగో నంబర్‌‌లో పంత్‌‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కాగా, పంత్‌‌తో పాటు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తునట్టు సమాచారం. ధవన్‌‌ గైర్హాజరీలో  లోకేశ్‌‌ రాహుల్‌‌  ఓపెనర్‌‌గా రావడం ఖాయమే కాబట్టి.. మిడిలార్డర్‌‌లో ఎంతో అనుభవం ఉన్న రాయుడును టీమ్‌‌లోకి తీసుకోవడంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.