పాలమూరుకు నీళ్లలో అన్యాయం..లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌తోనే వలసలకు బ్రేక్

పాలమూరుకు నీళ్లలో అన్యాయం..లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌తోనే వలసలకు బ్రేక్
  •     ప్రొఫెసర్ హరగోపాల్

షాద్‌‌‌‌నగర్, వెలుగు: సాగు, తాగునీటి విషయంలో పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్​ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగితేనే పాలమూరులో వలసలు ఆగుతాయని స్పష్టం చేశారు. బుధవారం షాద్‌‌‌‌నగర్‌‌‌‌లోని పెన్షనర్ భవన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలమూరు మీదుగా కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ జిల్లాకు సాగు, తాగునీరు అందడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఇప్పటివరకు లక్ష్మీదేవిపల్లి  రిజర్వాయర్ నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో డిజైన్లు మార్చారే తప్ప పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

దీనిపై ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాస్త్రవేత్త డి.నరసింహారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, పౌరహక్కుల సంఘం నాయకులు తిరుమలయ్య, రవీంద్రనాథ్, అర్జునప్ప, టీజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.