ధరణితో రైతులకు అన్యాయం : మంత్రి పొంగులేటి

ధరణితో రైతులకు అన్యాయం :  మంత్రి పొంగులేటి

జీడిమెట్ల, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో భూ రికార్డులను అస్తవ్యస్తంగా నిర్వహించి రైతులకు అన్యాయం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. త్వరలోనే రెవెన్యూ శాఖను పటిష్ట పరిచి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం కుత్బుల్లాపూర్ కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల కృతజ్ఞత సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను నాశనం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. శాఖలో ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 

ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలని ఉద్యోగులు మంత్రిని కోరారు.  వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని, మరణించిన వీఆర్వోల కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.