జగిత్యాల బల్దియాకు విజిలెన్స్ దడ

జగిత్యాల బల్దియాకు విజిలెన్స్ దడ
  • నిధుల దుర్వినియోగం లో లావాదేవీల చిట్టా అడిగిన విజిలెన్స్  
  • సరైన వివరాలు అందించక పోవడం తో   ఆఫీసర్ల సీరియస్  
  • వివాదస్పదంగా మారిన లాగ్ బుక్ ల్లో వివరాల నమోదు 

జగిత్యాల, వెలుగు : జగిత్యాల మున్సిపాలిటీలో  కొందరు ఆఫీసర్లు నిధులను  దుర్వినియోగం చేసినట్టు  వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేపట్టారు. ఈ నిధులకు  సంబంధించి పూర్తి నివేదిక  అందజేయాలని విజిలెన్స్​ అధికారులు ఈ నెల 15న ఆదేశాలు జారీ చేశారు.  కాగా,  సానిటేషన్ సెక్షన్ ఆఫీసర్లు అందించిన రిపోర్టు లో సరైన వివరాలు లేకపోవడం తో విజిలెన్స్ ఆఫీసర్లు సీరియస్ అయినట్లు సమాచారం. మరో సారి పూర్తి వివరాలు అందజేయాలని తిరిగి ఆదేశించారు.  

సానిటేషన్ సిబ్బంది లాగ్ బుక్ ల్లో ఎప్పటికప్పుడు  వివరాలు నమోదు చేయాల్సిఉండగా..  ఆరు నెలల వివరాలను ఒక్కసారే  నమోదు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   సానిటేషన్ విభాగానికి చెందిన  వెహికల్స్ రిపేర్లకు ఇచ్చిన  ఫండ్స్,   వాహనాల రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లు,  షో  రూమ్‌‌‌‌‌‌‌‌లకు పంపిన వాహనాల రికార్డులు,  డీజిల్ వివరాలు,  లాగ్‌‌‌‌‌‌‌‌బుక్స్​,  సీజనల్ వ్యాధుల  నివారణకు   వాడిన  కెమికల్స్, బ్లీచింగ్ వివరాలు,  ఫాగింగ్ లాగ్ బుక్‌‌‌‌‌‌‌‌రికార్డులు,   సానిటేషన్ లేబర్ బయోమెట్రిక్ అటెండెన్స్ రికార్డులను  విజిలెన్స్​ కోరింది.  

 వేటు పడే చాన్స్​

 సానిటేషన్ వెహికల్స్ కోసం  కొన్న డీజిల్ ను   పక్కదారి పట్టించి సోమ్ము చేసుకున్నారని బల్దియా అధికారుల మీద  ఆరోపణలు వచ్చాయి. సానిటేషన్ వెహికల్స్ రిపేర్ల ఖర్చులు  మూడింతలు చూపించినట్టు తెలిసింది.  ఫండ్స్​ ఖర్చుల విషయంలో    విజిలెన్స్ ఆఫీసర్లకు  పొంతనలేని జవాబులిచ్చి,  తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. బల్దియా అధికారుల రిపోర్టులు, సమాధానాలతో సంతృప్తి చెందని  విజిలెన్స్ ఆఫీసర్లు సరైన సమాచారంలో మళ్లీ  నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  

తమ  అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు  ఓ రిటైర్డ్ ఆఫీసర్ సలహాల మేరకు బల్దియా అధికారులు తప్పుడు వివరాలతో నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  రూల్స్ ప్రకారం లాగ్​ బుక్ లను మెంటెయిన్ చేయని, అవకతవకలకు పాల్పడిన  ఆఫీసర్లపై వేటు పడనుందని తెలుస్తోంది.  

రికార్డులు సరిదిద్దుతున్నారు

విజిలెన్స్ ఎంక్వైరీకి సానిటేషన్ సెక్షన్ ఆఫీసర్లు హజరయ్యారు. విజిలెన్స్ ఆఫీసర్లు మరి కొన్ని వివరాలు అడిగారు. ఆఫీసర్ల ఆదేశాల మేరకు రికార్డుల్లో, లాగ్​ బుక్కుల్లో సానిటేషన్ సిబ్బంది సరిదిద్దుతున్నారు.   

- అనిల్ కుమార్, బల్దియా కమిషనర్, జగిత్యాల