పోలీస్ రిక్రూట్ మెంట్ పై హైకోర్టులో విచారణ

పోలీస్ రిక్రూట్ మెంట్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లోని అభ్యర్థులందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయా జిల్లాల జనాభా నిష్పత్తికి అనుగుణం గా 5 వేల కానిస్టేబుళ్ల నియామకాలు చేయా లని నిర్ణయించినట్లు హైకోర్టుకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు  నివేదించింది. రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణించి నియామకాలు చేపడితే నగర, పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులే అత్యధిక పోస్టులు పొందే ప్రమాదముందని స్పష్టం చేసింది. అందుకే జిల్లాల్లో జనాభా దామాషా మేరకు కానిస్టేబుళ్ల నియామకాలకు జీవో 46 జారీ అయ్యిందని బోర్డు వివరించింది. 

టీఎస్‌ఎస్పీకి చెందిన 5 వేల కానిస్టేబుల్‌ పోస్టులను రాష్ట్ర స్థాయి  పోస్టులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలంటూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు పిటిషన్ వేశారు. దాన్ని గతంలో  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారించింది. కౌంటర్‌ వేసే వరకు నియామకాల ప్రక్రియ పూర్తి చేయబోమని బోర్డు అప్పట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు పైవివరాలతో హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2021లో  జీవో 46 ప్రకారం టీఎస్‌పీఎస్సీ పలు పోస్టుల నియామకాలు చేపట్టిందని.. నోటిఫికేషన్‌ జారీ అయ్యాక సవాల్‌ చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జీవో 46 ఉందని చెప్పింది.