- రంగంలోకి దిగిన జ్యుడీషియల్ కమిషన్
- బాధ్యులందరికీ నోటీసులిస్తం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- మాజీ సీఎం, మాజీ మంత్రి, అధికారులకూ లెటర్లు రాస్తం
- అవసరమైతే సమన్లు జారీ చేస్తం
- బహిరంగ విచారణ కూడా చేపడతాం
- 100 రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ రంగంలోకి దిగింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు చత్తీస్ గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలపై విచారణ మొదలుపెట్టింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్ల ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించడం, చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం గత నెలలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఆదివారం బీఆర్‌కే భవన్‌లోని 7వ అంతస్తులో తనకు కేటాయించిన కార్యాలయంలో జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా విచారణ..
అవకతవకలకు బాధ్యులైన వ్యక్తులందరినీ గుర్తించి త్వరలో నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి తెలిపారు. కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలు, వాదనలు తెలియజేయడానికి వారికి అవకాశమిస్తామని చెప్పారు. ‘‘మాజీ సీఎం, మాజీ మంత్రి, మాజీ విద్యుత్ ఉన్నతాధికారులందరీకి లెటర్లు రాస్తాం. తొలుత రిక్వెస్ట్ లెటర్స్ రాస్తాం. అవసరమైతే సమన్లు జారీ చేసే అధికారం కూడా మాకు ఉంటుంది” అని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా విచారణ నిర్వహిస్తామని, నిర్ణయాల్లో చట్టబద్ధతను మాత్రమే సమీక్షిస్తామని పేర్కొన్నారు. గడువు మేరకు 100 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులే ఇంకా విద్యుత్ సంస్థల డైరెక్టర్లుగా కొనసాగుతూ న్యాయ విచారణలో కమిషన్‌కు సహకరిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఫైళ్లను తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయని జస్టిస్ నరసింహా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... ‘‘మూడు ఒప్పందాలకు సంబంధించిన అన్ని ఫైళ్లు మా కార్యాలయానికి చేరాయి. ఇప్పటికే ఫైళ్ల ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయింది. అవసరమైతే ఇంకా ఫైళ్లను అడుగుతాం” అని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ..
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు చత్తీస్‌గఢ్ పీపీఏపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం త్వరలో బహిరంగ ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. ఎవరైనా సరే ఈ-–మెయిల్ ద్వారా గానీ, లెటర్ల ద్వారా గానీ తమ కార్యాలయానికి సమాచారం అందజేయవచ్చునని చెప్పారు. అది ఎలాంటి సమాచారమైనా పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు సైతం బహిరంగ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేయవచ్చునని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణ నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.