నిజామాబాద్ జిల్లాలో బోగస్ రేషన్కార్డులపై ఫోకస్

నిజామాబాద్ జిల్లాలో బోగస్ రేషన్కార్డులపై ఫోకస్
  • మూడు నెలల రైస్ తీసుకోని కార్డులు 25,415
  • ఆరు నెలల నుంచి వాడని కార్డులు 5,898 
  • రెవెన్యూ ఆఫీసర్ల విచారణ 

నిజామాబాద్​, వెలుగు: బియ్యం తీసుకోని రేషన్​ కార్డులపై రెవెన్యూ యంత్రాంగం ఎంక్వైరీ చేస్తోంది. కార్డులున్నవారు స్థానికంగా ఉన్నారా.. లేరా.. లేదంటే రెండుచోట్ల కార్డులు ఉన్నాయా  ?  బోగస్​ కార్డులా అని ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తి తర్వాత యంత్రాంగం చర్యలు తీసుకోనున్నది.  పనుల కోసం వలస వెళ్లిన కుటుంబాలు, కొత్తగా వివాహాలు, మృతి చెందిన పేర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

97 శాతం కార్డులపై మూడు నెలల బియ్యం..

జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 4,03,510 కాగా, 13,94,503 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో జూన్​ నెలలో 1,551 కొత్త కార్డులు మంజూరు చేయగా,  1,13,288 మంది లబ్ధిదారులను చేర్చారు. వీరికి ప్రతి నెలా 8,738 మెట్రిక్​ టన్నుల బియ్యం అవసరం. అయితే జూన్​లో ఒకేసారి మూడు నెలల  బియ్యం ఇవ్వడానికి 26,217 టన్నులు రిలీజ్ చేయగా, 3,78,095 కార్డులపై 25,427 టన్నుల బియ్యం పంపిణీ జరిగింది. 97 శాతం కార్డుదారులు బియ్యం తీసుకున్నారు. దానికి ముందు మే నెలలో 5,898 కార్డులపై ఆరు నెలల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేలింది. 

కారణాలేంటీ ?

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం అందిస్తోంది. అంతకు ముందు దొడ్డు బియ్యం ఇవ్వగా, అమ్ముకునేవారు. సన్న బియ్యం పంపిణీ చేయగా, దాదాపు రేషన్​కార్డుదారులు క్యూ కట్టి బియ్యం తీసుకెళ్లారు. మార్కెట్​లో రూ.50 నుంచి రూ.60 పలుకుతున్న బియ్యాన్ని గవర్నమెంట్ రూపాయికి ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రైస్ కోటా రిలీజ్ కావడమే ఆలస్యం పది రోజుల్లో  స్టాక్ ఖాళీ అవుతోంది. అంతకు ముందు మూడు వారాల వరకు కొనసాగేది. 

 డిమాండ్​ ఉన్న  రైస్​ మూడు నెలల కోటాను పంపిణీ చేసినా 25,415 మంది కార్డుదారులు ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఆఫీసర్లు ఫోకస్​ పెట్టారు. అంతకు ముందు నెలలో కూడా 5,898 కార్డులపై రైస్ పంపిణీ కాలేదు. 31,313 కార్డులపై బియ్యం తీసుకోకపోవడంతో తహసీల్దార్ల ఆధ్వర్యంలో విచారణ మొదలుపెట్టారు. సెప్టెంబర్ నెలలో రైస్​ పంపిణీ చేసే సమయానికి బోగస్​ కార్డుల లెక్క తేలనుంది.