డీఆర్సీ కేంద్రాలను రెడీ చేయాలి: రోనాల్డ్ రాస్

డీఆర్సీ కేంద్రాలను రెడీ చేయాలి:  రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు: ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో (డీఆర్సీ) ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.  గురువారం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి,  హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిటీ సీపీ సందీప్ శాండిల్య, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్​తో కలిసి సిటీలో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఎల్​బీ స్టేడియంలోని ముషీరాబాద్ సెగ్మెంట్​కు సంబంధించిన డీఆర్సీలను సందర్శించారు. ఈ సెగ్మెంట్ డీఆర్సీ కేంద్రాన్ని ఏవీ కాలేజీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిజాం కాలేజీలో ఏర్పాటు చేసే చాంద్రాయణగుట్ట సెగ్మెంట్ డీఆర్సీను  సందర్శించి ఇతర పనులు ఉంటే తొందరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం గోషామహల్, చార్మినార్, యాకత్ పురా, నాంపల్లి, కార్వాన్, బహుదూర్​పురా సెగ్మెంట్లకు చెందిన డీఆర్సీ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల్లో ఏదైనా రిపేర్లు ఉంటే పూర్తి చేయాలని రోనాల్డ్ రాస్ సూచించారు. 

బ్యాంక్ మేనేజర్లతో రోనాల్డ్ రాస్ సమావేశం

ఎన్నికల కోడ్​లో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, లెక్కకు మించిన డబ్బు ఉన్న అకౌంట్ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్‌‌కు రోజువారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని  రోనాల్డ్ రాస్‌‌ సూచించారు.  గురువారం బల్దియా హెడ్డాఫీసులో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బ్యాంకుల్లో జరిగే డిజిటల్‌‌ లావాదేవీల్లో అనుమానిత, లెక్కకు మించిన నగదు అకౌంట్లపై నిఘా ఉంచాలన్నారు.

వాటి సమాచారాన్ని ప్రతి రోజు ఉదయం 10 గంటల లోపు జిల్లా ఎన్నికల నోడల్ అధికారికి పంపించాలన్నారు.   యూపీఐ (గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే)ల ద్వారా ఎక్కువ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్​ఫర్ అవుతుంటే గుర్తించి ఆ సమాచారాన్ని అధికారులకు చెప్పాలన్నారు. డిప్యూటీ ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. నవంబర్ 13 నుంచి 30వ తేదీ వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల అకౌంట్ నంబర్లను సంబంధిత బ్యాంకులకు అందించడం ద్వారా వారి లావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, అడిషనల్ కమిషననర్‌‌‌‌ శంకరయ్య, ఐటీ అధికారులు మనీషా, ఆర్బీఐ  మేనేజర్  పాల్గొన్నారు.