వంశీరామ్ బిల్డర్స్‌‌పై ఎండీ సుబ్బారెడ్డి, డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు

వంశీరామ్ బిల్డర్స్‌‌పై ఎండీ సుబ్బారెడ్డి, డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
  • జూబ్లీహిల్స్‌‌లోని ఆఫీస్‌‌లో కీలక ఆధారాలు స్వాధీనం

హైదరాబాద్‌‌, వెలుగు : వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌‌ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌పై ఇన్​కమ్‌‌ టాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఫోకస్ పెట్టింది. ఆర్థిక లావాదేవీలు, ఐటీ చెల్లింపుల వివరాలు రాబడుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలోని 35 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేసింది. హైదరాబాద్‌‌లో 15 ప్రాంతాలు, ఏపీలోని 20 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రెయిడ్స్ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌‌‌‌ పెద్దమ్మ టెంపుల్‌‌‌‌ సమీపంలోని వంశీరామ్‌‌‌‌ బిల్డర్స్‌‌‌‌ కార్పొరేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ను అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అకౌంట్స్‌‌‌‌ సిబ్బందిని మినహా ఇతరులను అనుమతించలేదు. నందగిరి హిల్స్‌‌‌‌లోని ఎండీ టి.సుబ్బారెడ్డి ఇంటితో పాటు బంజారాహిల్స్ రోడ్‌‌‌‌ నంబర్‌‌‌‌7లోని ఆయన బావమరిది టి.జనార్దన్‌‌‌‌రెడ్డి ఇల్లు, కంపెనీల డైరెక్టర్లు, సీఈవోల ఇండ్లు, ఆఫీస్‌‌‌‌ల్లో సోదాలు జరిపారు. ఈ మేరకు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌‌‌, హార్డ్ డిస్క్‌‌‌‌లు, ఆన్‌‌‌‌లైన్ రికార్డులను సీజ్ చేసినట్లు సమాచారం. జనార్దన్‌‌‌‌రెడ్డి ఇంట్లో సీజ్‌‌‌‌ చేసిన డాక్యుమెంట్లను రెండు బ్యాగుల్లో ఐటీ ఆఫీస్‌‌‌‌కి తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో వంశీరామ్‌‌‌‌ బిల్డర్స్‌‌‌‌కు చెందిన కంపెనీలకు సమకూరుతున్న ఆదాయం, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్లు తెలిసింది. వివిధ ప్రాజెక్ట్‌‌‌‌ల్లో కొనుగోళ్లు, అమ్మకాల్లో చేతులు మారిన నగదుకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది.

ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు

విజయవాడ, నెల్లూరు సహా ఏపీలోని మొత్తం 25 ప్రాంతాల్లో ఐటీ ఆఫీసర్లు సోదాలు జరిపారు. విజయవాడ గుణదలలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇల్లు, సంస్థల్లో తనిఖీలు చేశారు. ఐదు టీమ్స్‌తో కలిసి సెర్చెస్ చేశారు. వీరు వంశీరామ్‌ బిల్డర్స్‌కు చెందిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో గతంలో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. రెండు హార్డ్‌ డిస్క్‌లతో పాటు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మొత్తం సోదాల్లో ల్యాండ్‌ అగ్రిమెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను గుర్తించినట్లు సమాచారం. భూములు, ప్రాపర్టీస్‌ను కొన్న సమయంలో డబ్బు చెల్లింపులు ఏ రూపంలో జరిగాయనే దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగుల పేర్లతో బ్యాంక్ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసినట్లు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. ఫ్లాట్స్‌ అమ్మకాల్లో వచ్చిన డబ్బుకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించినట్లు సమాచారం.