ఆర్జేగా మొదలుపెట్టి.. 100 సినిమాల్లో నటించి

ఆర్జేగా మొదలుపెట్టి.. 100 సినిమాల్లో నటించి

రచ్చ రవిగా అందరికి తెలిసిన రవి అసలు పేరు దొడ్డపాటి రవి కుమార్​. హన్మకొండలోని న్యూ రాయపురకు  చెందిన  రవికి చిన్నప్పట్నించే యాక్టింగ్ అంటే ఇష్టం. టీవీల్లో చూసి ఫేమస్​ యాక్టర్ల వాయిస్‍ని, బాడీ లాంగ్వేజ్​ని ఇమిటేట్ చేసేవాడు. అంతేకాదు వాళ్ల కాలనీలో జరిగే వినాయక నవరాత్రుల్లో మిమిక్రీ చేసేవాడు. తండ్రి శేఖర్‍  మున్సిపాలిటీలో డ్రైవర్‍.  అమ్మ అహల్య. రవికి నటన మీద ఇష్టం ఉన్నా సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దాంతో చెల్లెలు దాచుకున్న డబ్బులు ఇవ్వడంతో ఎన్నో ఆశలతో హైదరాబాద్‍ వచ్చాడు రవి. 

దుబాయ్​ ఛానెల్లో ఆర్జే
మిమిక్రీ టాలెంట్ ఉండడంతో జెమిని టీవీ ‘వన్స్​మోర్‍ ప్లీజ్‍’ ప్రోగ్రాంతో మొదటిసారి టీవీలో కనిపించాడు.  ఆ తర్వాత అవకాశాల కోసం చాలారోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. చేతిలో డబ్బులు లేక చాలారోజులు పస్తులున్నాడు. అతని పరిస్థితి తెలిసి వాళ్ల నాన్న ‘అక్కడ ఇన్ని కష్టాలు పడే బదులు ఇంటికి వచ్చెయ్. ఏదో పని చేసుకొని బతకొచ్చు​’ అనడంతో వరంగల్​ వెళ్లాడు. మున్సిపల్‍ కార్పొరేషన్‍లో ప్రైవేట్‍వర్క్​ ఇన్​స్పెక్టర్‍గా చేరాడు. ఆ తర్వాత కొన్నాళ్లు  దుబాయ్​లోని ఒక రేడియో ఛానెల్లో ఆర్జేగా పనిచేశాడు. అందులో తెలంగాణ యాసలో చేసిన ‘నవ్వుల నల్లబాలు’  ప్రోగ్రాం రవికి పేరు తెచ్చింది. అంతేకాదు డైరెక్టర్‍ క్రిష్ తండ్రి సాయిబాబా దగ్గర సీరియల్స్​ డైరెక్షన్‍ డిపార్ట్​మెంట్​లో పని చేశాడు.  

‘జబర్దస్త్’తో లైఫ్​ టర్న్​  
కమెడియన్​గా అవకాశాలు రావాలంటే  కామెడీ షోలో సక్సెస్ కావాలి. అందుకోసం  ‘జబర్దస్త్’ ఫేమ్  చమ్మక్​ చంద్రని కలిశాడు. రవి బాడీ లాంగ్వేజ్‍, డిఫరెంట్‍ వాయిస్​ చూసి తన టీంలో చేర్చుకున్నాడు చంద్ర. కామెడీతో  రచ్చ చేసే అతనికి ‘రచ్చ రవి’గా పేరు వచ్చింది. ఆర్టిస్ట్​గా జబర్దస్త్​లో అడుగుపెట్టి  టీం  లీడర్​ అయ్యాడు. వెరైటీ గెటప్స్​తో ఐదేండ్లు ఆడియెన్స్​ని కడుపుబ్బా నవ్వించాడు రవి.  

100 సినిమాలు..
వెండితెరపై మెరవాలన్న రవి కోరిక 2013లో తేజ డైరెక్టర్‍ చేసిన ‘వంద అబద్ధాలు’ సినిమాతో నెరవేరింది. మిమిక్రీతో పాటు మూడు ప్రాంతాల యాసల్ని అలవోకగా పలికే టాలెంట్ ఉండడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా  వరుస అవకాశాలు వచ్చాయి.  వాటిలో ‘నారప్ప, ఎంసీఏ, రెడ్‍, క్రాక్‍, శతమానం భవతి, రాజా ది గ్రేట్‍, నేనే రాజు నేనే మంత్రి, గద్దలకొండ గణేశ్‍,  కల్యాణ వైభోగం’  వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకు 100 సినిమాల్లో నటించాడు రవి.   

అదే నా డ్రీమ్​
చార్లీ చాప్లిన్ కామెడీ చూసి కమెడియన్ అవ్వాలనుకున్నా. చిన్నప్పుడు పురాణ కథలు, బుర్రకథలు వినడంతో కల్చర్​ మీద మంచి అవగాహన వచ్చింది. చిన్న సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల్లోనూ నటించాను. అన్ని భాషల్లో నటించాలన్నదే నా కోరిక​. అందుకని ఇతర రాష్ట్రాల భాష, మాండలికాలు నేర్చుకుంటున్నా. ఈ ఏడాది నటించిన ‘బటర్‍ ఫ్లై, తగ్గేదే లే, లైగర్​’తో పాటు మరో కన్నడ మూవీ రిలీజ్‍కు రెడీగా ఉన్నాయి. లైగర్‍ హిందీ వెర్షన్​లోనూ నా పాత్రకు నేనే  డబ్బింగ్‍ చెప్పుకున్నా. 

ఇజ్జగిరి రంజిత్‍, వరంగల్, వెలుగు