ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం

ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం

వరంగల్​ బల్దియాలో ఘటన​ 

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ బల్దియాలో సోమవారం జరిగిన ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడిని సెక్యూరిటీ గార్డులతో మెడపట్టి బయటకు గెంటేయించారు. హన్మకొండ మండలం హంటర్​రోడ్డు శాయంపేటకు చెందిన నంబూరి చారుమతి ఈమె బంధువు సిద్దార్థ్​లకు స్థానికంగా భూమి ఉంది. ఇది వివాదంలో ఉండగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వవద్దని, ఇంటి నంబర్​ కేటాయించవద్దని బాధితులు పలుమార్లు బల్దియాగ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గత నెలలో ఇంటి నిర్మాణానికి పర్మిషన్​తో పాటు నంబర్​ కూడా ఇచ్చారు. 

దీంతో మూడు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో సోమవారం జరిగిన గ్రీవెన్స్​లో ఆందోళన చేయడానికి ప్రయత్నించారు. దీంతో అధికారులు సిద్దార్థ్​ను ప్రజావాణి హాలు నుంచి సెక్యూరిటీ గార్డులతో బయటకు గెంటివేయించారు. ఈ ఘటనపై అధికారుల వివరణ కోరగా ఇరువర్గాల వాదనలు వింటామని, పిలిపించి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు.