ఉద్యమ కారులకు ఆది నుంచీ అవమానాలే

ఉద్యమ కారులకు ఆది నుంచీ అవమానాలే
  • అభియోగాలు మోపి కొందరిని.. పొగబెట్టి మరికొందరిని
  • వందల మందిని పార్టీ నుంచి పంపించిన కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్​ఎస్​లో ఎవరైనా స్ట్రాంగ్ అవుతున్నా, ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందుతున్నా వారిని ఒక ప్లాన్​ ప్రకారం బయటకు పంపడం కేసీఆర్​కు అలవాటు అనే చర్చ ఉద్యమ టైం నుంచీ నడుస్తోంది. కొందరిని అభియోగాలు మోపి, ఇంకొందరిని పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  తన బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీలను, ఇతర పార్టీల లీడర్లను టీఆర్ఎస్ లో విలీనం చేసుకొని, అవసరం తీరిన తర్వాత ఆ లీడర్లను పక్కనపెడుతారనే టాక్​ ఉంది. టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానంలో వందలాది మంది లీడర్లు కేసీఆర్ అవమానాలు, ఛీత్కారాలను భరించలేక వెళ్లిపోయారు. 
నరేంద్ర టు ఈటల  
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీలను కేసీఆర్ బతికి బట్టకట్టనియ్యలేదన్న విమర్శలు ఉన్నాయి. టైగర్ ఆలే నరేంద్ర ‘తెలంగాణ సాధన సమితి’ పేరుతో పార్టీ పెట్టి ఉద్యమిస్తుండగా.. విజయశాంతి ‘తల్లి తెలంగాణ’ పేరుతో పోరాటం చేస్తుండగా.. రాష్ట్ర సాధన కోసం ఒకటే పార్టీ  ఉంటే బాగుంటుందని చెప్పి ఆ ఇద్దరు నేతలను టీఆర్​ఎస్​లో చేర్చుకొని, తర్వాత బయటికి వెళ్లగొట్టారు.  ఆలే నరేంద్రపై అభియోగాలు మోపి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2004లో ఎమ్మెల్యేలుగా గెలిచిన శనిగరం సంతోష్ రెడ్డి, మందాడి సత్యనారాయణ, కాశిపేట లింగయ్య.. కేసీఆర్ తీరుతో విసిగిపోయి కాంగ్రెస్​లో చేరారు. కేసీఆర్ తీరు వల్ల మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు. 2004లో వరంగల్ ఎంపీగా గెలిచిన రవీంద్ర నాయక్‌‌ను టీఆర్ఎస్​ఆఫీసులోనే ఘోరంగా అవమానించారు. అప్పట్లో రవీంద్ర నాయక్‌‌ను బంజారా గాంధీ అని కేసీఆరే ప్రశంసించేవారు. అలాంటి గిరిజన నేతను సొంత పార్టీ ఆఫీసులోకే రానివ్వకుండా అడ్డుకొని అవమానించారు. ఈ దాడిలో గాయపడ్డ రవీంద్రనాయక్​..  కేసీఆర్ పై దుమ్మెత్తిపోసి బయటికొచ్చేశారు. అప్పట్లో కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. అమెరికా నుంచి కేటీఆర్​ రాగానే ఆయనకు మొండిచేయి చూపారు. దీంతో మహేందర్​రెడ్డి  పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఉద్యమ సమయంలో పార్టీకి అనేక సేవలు అందించిన దేశిని చిన్నమల్లయ్య కూడా కేసీఆర్​ తీరు వల్ల బయటకు వచ్చేశారు. ‘తెలంగాణ జాతర’ పేరుతో మన సంస్కృతి సంప్రదాయాలు, వంటలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి టికెట్ ఇస్తానని మాట ఇచ్చితప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పై చిన్న విమర్శనూ సహించని రఘునందనరావును కూడా పార్టీ నుంచి పంపేశారు. తెలంగాణ కోసం పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లిన చెరుకు సుధాకర్​ను కూడా ఇబ్బంది పెట్టారు. టీఆర్​ఎస్​కు పురుడు పోసిన టీంలో ఉన్న గాదె ఇన్నయ్యను ప్లాన్ ప్రకారం వెళ్లగొట్టారు. దాసోజు శ్రవణ్, రాములు నాయక్​కు  పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు తెచ్చారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేగులపాటి పాపారావు (సిరిసిల్ల), సుదర్శన్ రావు తదితరులు పార్టీలో అవమానాలు భరించలేకే దూరమయ్యారు. టీఆర్​ఎస్​ స్థాపన నుంచి వెంట ఉన్న ఈటల రాజేందర్​ను ఇప్పుడు కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి తన స్టైల్ రాజకీయాలను కేసీఆర్ మరోసారి చూపించారన్న విమర్శలు వస్తున్నాయి. 
అవమానపరచడంలో దిట్ట
ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఇతర పార్టీల లీడర్లను టీఆర్ఎస్‌‌లో చేర్చుకోవడం కేసీఆర్‌‌కు కొత్తేమీకాదు. పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ లీడర్లను అవమానపరచడంతో అనేక మంది లీడర్లు టీఆర్​ఎస్​కు  దూరమైన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర సాధన కోసం మొదటి  నుంచీ తీవ్రంగా పోరాడిన వివేక్ వెంకటస్వామిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. 2019 లోక్​సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారు. కేసీఆర్​ తీరుతో ఆయన బయటికొచ్చారు. ఉద్యమ కాలంలో తాను బలపడడానికి నాయకులను వాడుకొని అవసరం తీరాక గొంతుకోయడం కేసీఆర్‌‌కు అలవాటని వివేక్ మండిపడ్డారు. తొలితరం నుంచి తెలంగాణ ఉద్యమనేతగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును కూడా కేసీఆర్ తన అవసరాల కోసం వాడుకున్నారు. పొలిటికల్ జేఏసీ నేతగా అందరినీ ఒకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను కూడా కేసీఆర్ ఘోరంగా అవమానించారు. సొంత రాష్ట్రంలో సమస్యల పరిష్కారంపై పనిచేయడానికి జేఏసీని కొనసాగించాలన్న ఆలోచనను కేసీఆర్ వ్యతిరేకించారు. దీంతో కోదండరాం సొంత పార్టీ స్థాపించారు.

కేబినెట్‌‌లో ఉద్యమకారులు ఐదుగురే
ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో ఉన్న నేతల్లో ప్రస్తుత కేబినెట్‌‌లో ఐదుగురే మిగిలారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు 2009 తర్వాత వచ్చిన కేటీఆర్ మాత్రమే ఉన్నారు. మిగితా మంత్రులు ఎక్కువ మంది గతంలో ఇతర పార్టీల్లో ఉండి తెలంగాణ సాధనను తీవ్రంగా వ్యతిరేకించినవాళ్లే. వారిలో కొందరు కేసీఆర్ పై వ్యక్తిగతంగా సీరియస్ విమర్శలు, ఆరోపణలు చేసినవాళ్లున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ తెలంగాణ వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి గంగుల కమలాకర్ టీడీపీ నుంచే వచ్చారు. గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి టీఆర్ఎస్​లో చేరి మంత్రి అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి 2018 ఎన్నికల్లో గెలిచాక టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. టీడీపీలో ఉన్న సత్యవతి రాథోడ్ తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లో చేరారు. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. పార్టీని నమ్మి, ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన ఉద్యమకారులు ఎంత మంది ఉన్నా వేరే పార్టీల నుంచి తీసుకుని మరీ మంత్రి పదవులు ఇవ్వడం చాలామందిని నిరాశకు గురిచేసింది. దీంతో ఒకరొకరుగా అసలైన ఉద్యమకారులంతా టీఆర్ఎస్ ను వీడుతూ వచ్చారు. ఒకరకంగా వారిలో చివరి ముఖ్య నాయకుడు ఈటల రాజేందరే.

స్వార్థపరుడు.. వాడుకొని వదిలేస్తడు
వాడుకొని వదిలేయడం కేసీఆర్​కు కొత్తకాదు. పూర్తిగా స్వార్థపరుడు. కొడుకును సీఎం చేయాలనే సీనియర్లను పక్కన పెడుతున్నడు. టీఆర్​ఎస్​లో మొదటి నుంచి కొనసాగుతున్న వాళ్లను అణచివేసే కుట్ర జరుగుతోంది. అంతా తన ఫ్యామిలీ మెంబర్లకే చెందాలనేది కేసీఆర్​ ఆలోచన. నరేంద్ర, విజయశాంతి, కోదండరామ్​లను ఎలా అడ్డు తొలగించుకున్నారో ప్రజలకు తెలుసు. కమీషన్​ ఏజెంట్లు, బ్రోకర్లనే తన చుట్టూ పెట్టుకుంటున్నడు. ఈటల మంచి వ్యక్తి. ఆయనపై జులుం చూపించడాన్ని ఖండిస్తున్నం. కేసీఆర్​కు అవసరమొ చ్చినప్పుడు ఈటల తన భూమిని మార్టిగేజ్​ చేసి సాయపడ్డారు. ఇవన్నీ సీఎంకు తెలుసు. ఇప్పుడు వదిలిం చుకోవావడానికే ఇవన్నీ. తప్పుడు ఆరోపణలు చేసి, తనకిష్టమొచ్చినట్టు రిపోర్టులు తయారు చేయించి ఈటలను బర్తరఫ్​ చేయడం దారుణం. ‑మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి