
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో, జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ స్పోర్ట్స్స్కూల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావితరాల శ్రేయస్సు కోసం వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని సూచించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చెట్లను కాపాడుకోవడం ఎంతో కీలకమన్నారు. ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.
రాజంపేట గ్రామపంచాయతీకి పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాలి
ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామపంచాయతీకి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట గ్రామపంచాయతీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి రాజంపేట గ్రామపంచాయతీకి పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ట్రాక్టర్, చెత్తను తరలించే ట్రాలీల సైతం అందించాలని ప్రతిరోజు తడి, పొడి చెత్తలను ఇంటింటి నుండి సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. అంతర్గత రోడ్లు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.