
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు, ఉద్యోగులు కాటేజీల ప్రాంగణంలో పూల, పండ్ల మొక్కలను నాటారు. ఏఈవోలు శ్రావణ్‌కుమార్, భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్ రాజు పాల్గొన్నారు.
అంతకుముందు ఉదయం రామాలయంలో గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక తిరుమంజనాలు చేశారు. తమలపాకులు, అప్పాలు, నిమ్మకాయల మాలలను నివేదించారు. హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. సీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.