
చౌటుప్పల్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ వైద్యులకు సూచించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని మెడికల్, కాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్ ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు.
వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఆస్పత్రి నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని, మరో ఆరు నెలల్లో 100 పడకల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
సామాజిక ఆస్పత్రిలో ప్రతిరోజు సుమారు 300 మంది ఔట్ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆస్పత్రికి వచ్చే క్యాన్సర్ పేషెంట్లకు వైద్య చికిత్సలు అందించడమే కాకుండా రాలేని వారికి సైతం ఇంటి వద్దకు వెళ్లి వైద్యం అందించడం గొప్ప విషయమన్నారు.ఆస్పత్రిలో పేషెంట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. జిల్లా వైద్యాధికారి మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్, డిప్యూటీ డీఎంహెచ్ వో యశోద, ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి పాల్గొన్నారు.