బషీర్బాగ్, వెలుగు: ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీమా రంగ సంస్థలు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా అబిడ్స్ లోని ఓ హోటల్ లో జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఆల్ ఇండియా అసోసియేషన్ రీజినల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరులోక్ సింగ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) మినహాయించాలని కోరారు.
లేనిపక్షంలో ఆ ప్రభావం ప్రజలపై పడుతుందన్నారు. 1971లో ఉన్న 107 బీమా కంపెనీలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాలుగు బీమా కంపెనీల్లో కలిపారని తెలిపారు. కానీ ఇప్పటికి వాటికి గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి రూ. వేల కోట్లు ఆదాయాలు తెస్తున్న ప్రభుత్వ బీమా కంపెనీలను కాకుండా ప్రైవేటు బీమా కంపెనీలకు కేంద్రం కొమ్ముకాయడం సరికాదన్నారు. కేంద్రప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
