BRS కు సమాచారం ఇస్తున్నదెవరు? సచివాలయంలో ఆర్డర్ల మాయంపై ఆరా.. నిగ్గు తేల్చే పనిలో ఇంటెలిజెన్స్

BRS కు సమాచారం ఇస్తున్నదెవరు? సచివాలయంలో ఆర్డర్ల మాయంపై ఆరా.. నిగ్గు తేల్చే పనిలో ఇంటెలిజెన్స్
  • లీకు వీరులెవరు? 
  • డ్రాఫ్ట్ దశలో బయటికెలా పోతున్నాయ్
  • నిగ్గు తేల్చే  పనిలో ఇంటెలిజెన్స్ 

హైదరాబాద్: సచివాలయంలో డ్రాఫ్ట్ దశలో ఉన్న ఆర్డర్లు మాయమవుతుండటం, అవి కాస్తా బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఈ క్రమంలో సమగ్ర విచారణ ప్రారంభమైంది. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు..? ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నది..? అనే అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. 

ఇటీవల భూముల కేటాయింపు అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫార్మేషన్ పాలసీ వెనుక ఐదు లక్షల కోట్ల భూ కుంభ కోణం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ. 50 వేల కోట్లను సీఎం జేబులో వేసుకోవాలని చూస్తున్నారని, ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం అని ఆరోపించారు. దీనిపై కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోనే తాము ఫాలో అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు.  

తాము ఇంకా అలాంటి జీవోనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. మీరు జీవో ఇవ్వకుండానే బీఆర్ఎస్ కు ఎలా వెళ్లిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన దాట వేశారు. ఈ క్రమంలో ఇంటిదొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇలా ప్రతిపక్షానికి ఎలాంటి సమాచారం లీకవుతోంది..? డ్రాఫ్ట్ దశలో ఉన్న జీవోలు ఎలా బయటికి వెళ్తున్నాయ్..? అనే అంశంపై ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమై ఉన్నాయి.