- అధికారులతో హనుమకొండ కలెక్టర్ రివ్యూ
హనుమకొండ, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకం భూముల దందాపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. దేవాదుల కోసం రైతుల నుంచి సేకరించిన భూమి ప్రాజెక్టు పేరున మ్యుటేషన్ చేయకపోవడంతో కొంత మంది అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న వ్యవహారంపై మంగళవారం ‘వెలుగు’లో ‘ఆక్రమణల చెరలో దేవాదుల భూములు’ కథనం ప్రచురితమైంది. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ధర్మసాగర్ మండలంలో వివిధ సర్వే నంబర్లలోని దేవాదుల ప్రాజెక్టు భూముల వివరాలను ఆఫీసర్లు కూపీ లాగుతున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన వారి వివరాలతో పాటు ప్రస్తుతం ఆ భూమి ఎవరి పేరు మీద ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. దేవాదుల భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీంతో దేవాదుల భూముల దందాలో కీలక పాత్ర పోషించిన వారిలో టెన్షన్ మొదలైంది.
భూములను మ్యుటేషన్ చేయాలి: కలెక్టర్
జిల్లాలో భూసేకరణ కింద సేకరించిన భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో మార్చాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ అనంతరం రికార్డుల నవీకరణపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో మంగళవారం కలెకర్ట్ రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సేకరించిన భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ పాత పట్టాదారుల పేరిటే ఉందని, వాటిని గుర్తించి ప్రాజెక్టుల పేరిట మార్చాలన్నారు. ఈ అంశంపై ప్రతి వారం రివ్యూ చేస్తానని, దీనిపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు. హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తహసీల్దార్లు జ్యోతి వరలక్ష్మి దేవి, ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, నాయబ్ తహసీల్దార్లు సంతోష్ కుమార్, శ్యామ్ కుమార్
పాల్గొన్నారు.
