గుండెపోటుతో ఇంటర్ జేడీ ఓబిలిరాణి కన్నుమూత

గుండెపోటుతో ఇంటర్ జేడీ ఓబిలిరాణి కన్నుమూత
  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఇంటర్మీడియెట్ కమిషనరేట్​లో జాయింట్ డైరెక్టర్ ఓబిలి రాణి(59) గుండెపోటుతో కన్నుమూశారు. పద్మారావునగర్​లోని తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెలో నొప్పిరావడంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శనివారం ఆమె అంత్యక్రియలు చేశారు.  అయితే శుక్రవారం ఆమె ఆఫీసు నుంచి గుండె నొప్పిగా ఉండి రావడంతో  కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్​ లో చికిత్స చేయించారు. విద్యాశాఖలో ఆమె  హైదరాబాద్ డీఐఈఓ, వరంగల్ ఆర్జేడీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్​గా ఉన్న ఆమెకు కొన్నేండ్లుగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు.  కారు ఫెసిలిటీ ఉన్నా కల్పించలేదు.  దీంతో ఆమె తన కూతురి కారును వాడుకొని  బిల్లు  పొందింది. దీన్ని సీరియస్​ గా తీసుకున్న  ఉన్నతాధికారులు   నోటీసులు జారీచేశారు.

కారు అలవెన్స్​ను జీతం నుంచి రికవరీ చేశారు. కొందరు అధికారులు కావాలని తనపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ముందు అనేకసార్లు ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. తీవ్ర మానసికవేదనతో ఆమె గుండెపోటు వచ్చి చనిపోయినట్టు తోటి సిబ్బంది చెప్తున్నారు.  అధికారిణి చనిపోతే ఇంటర్మీడియెట్ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆఫీసులో చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్జేడీ జయప్రదబాయి అంత్యక్రియల్లో పాల్గొనలేదు. కనీసం ఆఫీసులో జరిగిన సంతాపసభలోనూ కనిపించలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు.