ఇంటర్ బోర్డ్ లీలలు: ముందు 0.. రీ వెరిఫికేషన్ లో 99 మార్కులు

ఇంటర్ బోర్డ్ లీలలు: ముందు 0.. రీ వెరిఫికేషన్ లో 99 మార్కులు

తెలంగాణ ఇంటర్ బోర్డు తీరు పలు వివాదాలకు దారితీస్తోంది. మార్కుల మెమోల్లో తప్పులు రావడంతో… విద్యార్థులు తీవ్ర ఆందోలనకు లోనయ్యారు. ఇంటర్ ఫలితాల్లో మార్కులు తారుమారు అయ్యాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు.

సందేహాలు ఉంటే రీ వెరిఫికేషన్ పెట్టుకోవాలని… తాము తప్పులు చేయలేదని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ ఇటీవల నాంపల్లిలో గట్టిగా చెప్పారు. కానీ.. రీ వెరిఫికేషన్ లో మాత్రం అందుకు భిన్నమైన వాస్తవాలు బయటపడుతున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మంచిర్యాల జిల్లా టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థినికి సెకండియర్ ఫలితాల్లో మాత్రం ఊహించని షాక్ తగిలింది. జిల్లాలోని జన్నారం మండలం చింతగూడకు చెందిన విద్యార్ధిని నవ్యకు ఇంటర్  సెకండ్ ఇయర్ .. తెలుగు సబ్జెక్ట్ లో సున్నా మార్కులు వచ్చాయి.  ఆమె హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేసింది. వెంటనే అధికారులు ఆ విద్యార్థిని పేపర్ ను రీ వెరిఫికేషన్‌ చేశారు. విచిత్రంగా…ఈసారి ఆమె 99 మార్కులు తెచ్చుకుంది. ముందుగా విడుదలచేసిన ఫలితాల్లో ఆ విద్యార్థినికి 0 మార్కులు వేసిన అధికారులు సడన్‌గా 99 మార్కులు వేశారు.

ఈ సంఘటన ఇంటర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో అనడానికి ఓ ఉదాహరణ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.