క్లాస్‌ రూంలో ఇంటర్ స్టూడెంట్‌ సూసైడ్

క్లాస్‌ రూంలో ఇంటర్ స్టూడెంట్‌ సూసైడ్
  • లైంగిక వేధింపులు, అనారోగ్య కారణాలతోనే అని సూసైడ్‌ నోట్
  • దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు
  • అనుమానాలున్నయ్.. విచారణ జరిపించాలని
  • కాలేజీ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

గచ్చిబౌలి, వెలుగు: సిటీలోని గచ్చిబౌలి పరిధి గౌలిదొడ్డి సోషల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్​ లింగారపు వంశీకృష్ణ (17) సూసైడ్​ చేసుకు న్నాడు. లైంగిక వేధింపులు, అనారోగ్య సమస్యలతో చనిపోతున్నట్టు రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ స్టూడెంట్‌ బ్యాగ్‌లో దొరికింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నాగర్‌‌ కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన వంశీకృష్ణ గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన వంశీ.. ఈనెల  2న తిరిగి కాలేజీ హాస్టల్‌కు వచ్చాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ పూర్తయిన తర్వాత హాస్టల్‌కు వెళ్లిన వంశీ.. శనివారం ఉదయం తన క్లాస్ రూంలో సీలింగ్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. కాలేజీ మేనేజ్‌మెంట్‌ కంప్లయింట్​తో ఘటనా స్థలానికి వెళ్లిన గచ్చిబౌలి పోలీసులు వంశీకృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. 
 

రెండు పేజీల సూసైడ్ నోట్‌
ఆత్మహత్య చేసుకున్న రూంలోని వంశీకృష్ణ బ్యాగులో ఇంగ్లీష్, తెలుగులో రాసిన రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకుంటున్నట్టు ఒక పేజీలో, బ్లడ్ కేన్సర్‌‌ లాస్ట్‌ స్టేజీలో ఉందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మరో పేజీలో రాసి ఉందని పేర్కొన్నాడు.  హాస్టల్‌ రూం నుంచి అర్ధరాత్రి క్లాస్ రూంకు వచ్చి, చున్నీతో ఉరేసుకున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

అనుమానాలున్నయ్.. తల్లిదండ్రులు
వంశీకృష్ణ ఆత్మహత్యపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకుంటే శనివారం ఉదయం వరకు తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కాలేజీ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తూ కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. తన కొడుకుకి ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేవని తండ్రి లక్ష్మయ్య గౌడ్‌  చెప్తున్నారు. వంశీ మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.