ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇస్తలేరు

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇస్తలేరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కుల వివక్ష నశించాలన్న లక్ష్యంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేటోళ్లకు అందించే ప్రోత్సాహం సక్కగ అందుతలేదు. రాష్ట్రంలో అంబేద్కర్ స్కీమ్ ఫ‌‌‌‌‌‌‌‌ర్ సోష‌‌‌‌‌‌‌‌ల్ ఇంటెగ్రేష‌‌‌‌‌‌‌‌న్ అనే పేరుతో ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తున్నా.. అది నామ్‌‌‌‌‌‌‌‌కేవాస్తేగానే నడుస్తున్నది. అర్హులైన జంటలకు ఇన్సెంటివ్స్ అమలు చేసే విషయంలో ఏండ్లకేండ్లు ఆలస్యమైతున్నది. 18 నెలలుగా వందలాది అభ్యర్థుల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నయి. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రూ.2.5 లక్షల ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ బాండ్లు కనీసం నాలుగున్నరేండ్లు గడిస్తే గానీ చేతికి రావడం లేదని.. ప్రభుత్వం, అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఎస్సీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2011 వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం.. 2012 నుంచి రూ.50వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో దీనిని రూ.2.5 లక్షలకు పెంచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చొప్పున నిధులు కేటాయిస్తాయి. కానీ రాష్ట్రంలో ఈ నిధులను అర్హులకు చేర్చే విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఇప్పటి వరకు 1815 దరఖాస్తులు

రాష్ట్రంలో కొన్నేండ్లుగా కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతోంది. ఇలా పెండ్లి చేసుకున్న జంటలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు, మరొకరు ఇతర క్యాస్ట్ వాళ్లు అయితేనే ఇన్సెంటివ్ వస్తుంది. అయితే ఇందుకోసం క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా అధికారులకు అందించాల్సి ఉంటుంది. 2019 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 1,815 జంటలు ఈ ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 1,127 జంటలకు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేయగా, 20 అప్లికేషన్లు రిజెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. మిగతా 668 దరఖాస్తులపై అధికారులు ఏ నిర్ణయం తీసుకోకుండా పెడింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఇచ్చినా.. 

ప్రభుత్వం ఈ స్కీంకు బడ్జెట్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ (బీఆర్‌‌‌‌‌‌‌‌వో) ఇస్తుంది. దీన్ని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చేయాలని హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ జిల్లాలకు పంపిస్తారు. ఆ తర్వాత ఫార్మాలిటీస్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేశాక పే అండ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో వేస్తారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా వెరిఫై చేసి లబ్ధిదారులకు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. టోకెన్లు ఇచ్చి ఆర్డర్ వారీగా చెక్కులు ఇస్తారు. కానీ టోకెన్‌‌‌‌‌‌‌‌, చెక్కు ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అయినా ప్రభుత్వం అనుమతి అని, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అప్రూవల్‌‌‌‌‌‌‌‌ కావాలని చెబుతూ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెడుతున్నారు. 
మూడేండ్లు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ తప్పనిసరి
ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి చెక్ ఇష్యూ అయ్యాక కులాంతర వివాహం చేసుకున్న భార్యభర్తలు, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కలిపి ముగ్గురి పేరు మీద మూడేండ్ల పాటు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ చేస్తారు. దీనికి సంబంధించిన బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆ జంటకు ఇస్తారు. ఆ మూడేండ్ల తర్వాత రూ.2.5 లక్షల డబ్బు వారి అకౌంట్‌‌‌‌‌‌‌‌లో పడుతుంది. అయితే అధికారుల రకరకాల కొర్రీలతో ఇప్పటికే 18నెలలు గడుస్తున్నా ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు కూడా చేయలేదు. దీంతో పెండ్లయిన నాలుగైదేండ్ల తర్వాత కూడా ఆ డబ్బు చేతికి వచ్చేలా కనిపించడం లేదు. 
నేరుగా క్యాష్ ఇస్తే మేలు
ఇదే పథకాన్ని కర్నాటక ప్రభుత్వం ఎస్సీ పెళ్లి కూతురు అయితే మూడు లక్షలు, ఎస్సీ పెళ్లి కొడుకు అయితే 2.5 లక్షలు ఇన్సెంటివ్ అందిస్తోంది. ఈ మొత్తాన్ని రెండు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఫైల్‌‌‌‌‌‌‌‌ వెరిఫికెషన్‌‌‌‌‌‌‌‌ కాగానే ఒక ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్, మరికొన్ని రోజుల తర్వాత రెండో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అలానే ఇస్తే బాగుంటుందని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఎప్పుడొస్తయో తెలియట్లే


నేను ఇంటర్ క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యారెజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాను. అధికారులు చెప్పిన ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లోనే ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికే మూడేండ్లు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌ ఉంది. సర్కారు ఇంకా లేట్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల డబ్బులు ఎప్పుడు వస్తాయనేది తెలియట్లేదు.
                                                                                                                                                                             - జక్కుల రాజశేఖర్‌‌‌‌‌‌‌‌,   దరఖాస్తుదారుడు, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌


ఉద్దేశపూర్వకంగానే ఇస్తలేరు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై సర్కారు సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌ క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌‌‌‌‌ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా ఏవేవో సాకులు చెబుతున్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాక మళ్లీ సర్కారు అనుమతి ఎందుకు?  ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తున్నారు.  
                                                                                                                                                             - బత్తుల రామ్ ప్రసాద్,    ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, మాల సంక్షేమ సంఘం