కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదం.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదం.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. 

మరి నన్నెందుకు పిలువలేదు...?

తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి అయినందున ఆయన చేతుల మీదుగానే సచివాలయం ఓపెనింగ్ జరిగిందని, గవర్నర్‌కు ఆహ్వానమే పంపలేదని తమిళిసై వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని... పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని ఆమె అన్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా  అని ఆమె వ్యాఖ్యానించారు.

కొత్తగా నిర్మించిన పార్లమెంటు ప్రారంభోత్సవంపై తీవ్ర చర్చ జరుగుతోంది.  పార్లమెంట్ ను ప్రధాని ప్రారంభించడమేంటని, రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓపెనింగ్ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.