సబ్సిడీలు తగ్గినయ్

సబ్సిడీలు తగ్గినయ్

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ లో ఫుడ్, ఫర్టిలైజర్ సబ్సిడీలకు నిధులు తగ్గాయి. 2023–24 బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 8 శాతం తక్కువగా రూ. రూ. 3.69 లక్షల కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. ఇందులో ఫుడ్ సబ్సిడీ కింద రూ. 2,05,250 కోట్లను అలకేట్ చేశారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 2024 నాటికి రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ. 2,12,322 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్ లో ఇంతకంటే రూ. 7 వేల కోట్లు తక్కువగా కేటాయించారు.

ఇక ఫర్టిలైజర్ సబ్సిడీ కింద గత బడ్జెట్ లో రివైజ్డ్ అంచనాల మేరకు రూ. 1.89 లక్షల కోట్ల మేరకు కేటాయించగా.. ఈసారి బడ్జెట్లో రూ. 1.64 లక్షల కోట్లను మాత్రమే అలకేట్ చేశారు. కాగా, కేంద్రం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. అలాగే రైతులకు ఎరువులపై భారీ మొత్తంలో సబ్సిడీని భరిస్తోంది. ఇక వంట గ్యాస్ సహా పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీకి గత బడ్జెట్ లో రూ. 12,240 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 315 కోట్లు తక్కువగా రూ. 11,925 కోట్లు కేటాయించారు.