యూజీసీకి 61% కోత

యూజీసీకి 61% కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్  కేటాయింపుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్ (యూజీసీ) కు భారీగా కోత పడింది. ఏకంగా 61 శాతం కోత విధించారు. యూజీసీ కేటాయింపుల్లో నిరుటి సవరించిన అంచనాలు రూ.6,409 కోట్ల నుంచి రూ.2500 కోట్లకు (61 శాతం కోత) తగ్గించారు. అలాగే ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కోతలు పెట్టారు. నిరుటి సవరించిన అంచనాలు రూ.608.23 కోట్ల నుంచి రూ.300 కోట్లకు తగ్గించారు. బడ్జెట్  కేటాయింపులు కూడా రూ.331 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.212.21 కోట్లకు తగ్గించారు.

ఇక ఐఐటీలకూ గ్రాంట్లు రూ.10,384.21 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.10,324.50 కోట్లకు తగ్గించారు.  అయితే సెంట్రల్  యూనివర్సిటీలకు గ్రాంట్లను 28 శాతం పెంచారు. సెంట్రల్  వర్సిటీలకు బడ్జెట్ ను రూ.12000.08 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.15,472 కోట్లకు పెంచారు. అలాగే, స్కూల్  ఎడ్యుకేషన్ కు ఈసారి కేటాయింపులు రికార్డు స్థాయిలో పెరిగాయి. 

రూ.72,743.80 కోట్ల నుంచి రూ.73,008.10 కోట్లకు కేటాయింపులు చేశారు. కాగా హయ్యర్  ఎడ్యుకేషన్ కు ఏకంగా రూ.9600 కోట్లు తగ్గించారు. సవరించిన అంచనాలు రూ.57,244.48 కోట్ల నుంచి రూ.47,619.77 కోట్లకు తగ్గించారు. మధ్యంతర బడ్జెట్  సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడుతూ 2014 నుంచి కొత్తగా 7 ఐఐటీలు, 16 ట్రిపులు ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్ లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే 3 వేల ఐటీఐలను నెలకొల్పామని చెప్పారు.