ఇంటర్ బోర్డులో రూల్స్ జాన్తానై

ఇంటర్ బోర్డులో రూల్స్ జాన్తానై

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ బోర్డు తరచూ వివాదాలకు కేరాఫ్​గా మారుతోంది. సర్కారు ఉత్తర్వులను పట్టించుకోకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులు, లెక్చరర్లకు ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు, డిప్యుటేషన్లు చేస్తున్నారు. రిటైర్ అయిన వారిని తీసుకోవద్దనే జీవోలున్నా, పట్టించుకోకుండా కొందర్ని ఓఎస్డీలుగా సైతం నియమించారు. ఇవన్నీ సర్కారు పెద్దలకు తెలియకుండానే జరుగుతున్నాయా? అన్న సందేహాలు వస్తున్నాయి. రెండేండ్ల కింద రూల్స్​కు విరుద్ధంగా గ్లోబరినాకు కాంట్రాక్టు కట్టబెట్టి.. స్టూడెంట్ల రిజల్ట్ తప్పులతడకగా ఇవ్వడంతో పదుల సంఖ్యలో స్టూడెంట్లు చనిపోయారు. నిరుడు అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చరిత్రను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా అక్రమంగా ప్రమోషన్లు, బదిలీలు, డిప్యుటేషన్లతో ఇంటర్ బోర్డు మరోసారి విమర్శలపాలు అవుతోంది. సర్కారుతో సంబంధం లేకుండానే లెక్చరర్లు కాలేజీలకు వెళ్లడంపై, ఆన్​లైన్ క్లాసుల ప్రారంభం, సెకండ్ లాంగ్వేజీ సంస్కృతం ప్రవేశపెట్టాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు కూడా దుమారం రేపుతున్నాయి.  

రూల్స్ కు విరుద్ధంగా.. 

రిటైర్ అయినోళ్లను ఓఎస్డీలు, కన్సల్టెంట్లుగా తీసుకోవద్దని సర్కార్ జీవో గతంలోనే వచ్చింది. అయినా, బోర్డు మాజీ సీవోఐ సుశీల్ కుమార్ రెండేండ్ల నుంచి ఓఎస్డీగా కొనసాగుతున్నారు. రిటైర్డ్ లెక్చరర్ బహుగుణ సారథిని, బోర్డు మాజీ డీఎస్, ఎంప్లాయీస్ లీడర్ జగన్ మోహన్ రెడ్డినీ ఓఎస్డీలుగా నియమించారు. మరో 13 మందిని అదర్ డ్యూటీ (ఓడీ) కింద వేర్వేరే ప్రాంతాలకు పంపారు. వరంగల్ ఆర్జేడీ ఆఫీసులో ముగ్గురిపై ఆరోపణలు వచ్చాయని బదిలీ చేశారు. కానీ వారిపై ఎలాంటి చార్జెస్ ఫ్రేమ్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరికొందరికి ప్రమోషన్లు వచ్చినా, ఇంతకుముదు ఉన్న చోటే పని చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఇటీవల ఏకంగా 27 మందిని బదిలీ చేస్తే దాంట్లో, 15 ట్రాన్స్​ఫర్లు డీఐఈఓ ఓరల్ ఇన్​స్ర్టక్షన్స్​ ద్వారానే జరిగాయని సమాచారం. అవసరం లేనిచోటికి కొందర్ని బదిలీ చేశారనీ, ఇవన్నీ కమిషనరేట్​కు తెలియకుండానే జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ బదిలీలపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూదన్​రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం కమిషనర్​ను కలిసి వినతిపత్రం అందించారు.