ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు : రేపే చివరి తేదీ

ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు : రేపే చివరి తేదీ

ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి గురువారంతో విత్ ఔట్ లేట్ ఫీజు గడువు ముగియనుంది. మొదట అక్టోబర్ 29 వరకు పరీక్ష ఫీజులకు గడువు ఇచ్చింది. ఇంటర్ బోర్డులో సాంకేతిక సమస్యలు రావడంతో విద్యార్ధుల విజ్ఞప్తితో ఈ నెల 7వరకు పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కు 470 రూపాయల ఫీజు, సెకండియర్ థియరీ ప్రాక్టికల్స్ కు కలిపి 650 చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్  ఒకేషనల్ ప్రాక్టికల్స్ లేకుండా 470 రూపాయలు,  ఫస్ట్ ,సెకండియర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్ తో  కలిపి 650 రూపాయల ఫీజును చెల్లించాలని బోర్డు తెలిపింది. ఎవరైనా నవంబర్ 7 వరకు ఫీజు చెల్లించకపోతే లేట్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

లేట్ ఫీజు 100 రూపాయలతో  ఈ నెల 8 నుంచి 18 వరకు,  లేట్ ఫీ 500 రూపాయలతో ఈ నెల 19 నుంచి 28 వరకు, లేట్ ఫీ 1000తో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9వరకు,  2వేల ఫైన్ తో డిసెంబర్ 10 నుంచి 17 వరకు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇంటర్ బోర్డు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అధికారులు. ఆయా కాలేజీ యాజమాన్యాలపై  చర్యలు తీసుకుంటామన్నారు.  ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే.. సంబంధిత జిల్లా ఇంటర్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని శ్రీ గాయత్రి కాలేజ్ అధిక ఫీజులు వసూలు చేసినందుకు నోటీసులిచ్చామన్నారు బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్.

గతేడాది కొన్ని ప్రైవేట్ సంస్థల సాఫ్ట్ వేర్లతో ఫీజు కట్టడం, సెంటర్, హాల్ టికెట్స్ తీసుకోవడంలో విద్యార్ధులకు ఇబ్బందులు వచ్చాయన్నారు కమిషనర్ ఒమర్ జలీల్. ఈసారి అలాంటి ఇబ్బందుల్లేకుండా … సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయించామన్నారు. అందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ పని చేస్తోందని తెలిపారు. ఇంటర్ పరీక్షల ఫీజులకు గురువారం లాస్ట్ డేట్ ఉందని .. ఏ విద్యా సంస్థ అధిక ఫీజులు వసూలు చేసినా… కఠిన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించింది బోర్డు. రేపు సాయంత్రం వరకు విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులు చెల్లించాలని, మళ్లీ ఫీజు చెల్లింపు డేట్ పొడిగించబోమని స్పష్టం చేసింది.