- ఇంటర్లో బ్లాంక్ బార్ కోడ్ విధానం బంద్..
- ఫలితాలు లేటవుతున్నందుకే బోర్డు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లలో ఆఖరి నిమిషంలో మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకుంటామంటే ఇక కుదరదు. పరీక్షల సమయంలో బార్ కోడ్ లేని ఓఎంఆర్ షీట్లు(బ్లాంక్ బార్ కోడ్) ఇచ్చే విధానానికి ఇంటర్ బోర్డు స్వస్తి పలికింది.
ఈ ఏడాది నుంచే ‘నో బ్లాంక్ బార్ కోడ్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో త్వరగా ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది అటెండ్ కానున్నారు. అయితే, గతంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు పొర పాటున మీడియం గానీ, సెకండ్ లాంగ్వేజ్ గానీ తప్పుగా పెడితే.. చివరికి పరీక్ష రోజూ కూడా మార్చుకునే వెసులుబాటు ఉండేది.
ఎగ్జామ్ సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్లు విద్యార్థి వివరాలతో కూడిన బార్ కోడ్ షీట్ కాకుండా, బార్ కోడ్ లేని (బ్లాంక్) ఓఎంఆర్ షీట్ ఇచ్చేవారు. దాంతో విద్యార్థులు తమకు కావాల్సిన మీడియం లేదా లాంగ్వేజ్‌లో పరీక్ష రాసేవారు. అయితే, ఈ బ్లాంక్ బార్ కోడ్ షీట్ల వాల్యుయేషన్, వాటిని ప్రాసెస్ చేయడం తలనొప్పిగా మారింది.
దీనివల్ల మొత్తం ఫలితాల ప్రక్రియ ఆలస్యం అవుతోందని బోర్డు అధికారులు గుర్తించారు. అందుకే ఇకపై పరీక్ష కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులకు అవకాశం ఇవ్వకూడదని, ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతోనే పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
తప్పులుంటే ముందే చూసుకోండి..
పరీక్షల టైంలో ఇబ్బందులు రాకూడదంటే ఇప్పుడే అలర్ట్ కావాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాలేజీల్లో అందుబాటులో ఉన్న నామినల్ రోల్స్(ఎన్ఆర్) లిస్టులో స్టూడెంట్ల పేర్లు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఇతర వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల ని తెలిపింది. పేరెంట్స్, స్టూడెంట్స్ వెంటనే చెక్ లిస్టును పరిశీలించుకొని.. ఏమైనా తప్పులుంటే ఈ నెలాఖరులోగా సరిచేయించుకోవాలని స్పష్టం చేసింది.
అయితే, నిబంధనల ప్రకారం ఎగ్జామ్ ఫీజు కట్టే సమయంలో చెక్ లిస్టు చూసి పేరెంట్స్, స్టూడెంట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధనను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. అందుకే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
