ముందు పైసలు కట్టండి.. ఆ తర్వాతే స్టాక్ తీసుకెళ్లండి: అప్పుపై పెట్రోల్ డీజిల్ సరఫరా బంద్

ముందు పైసలు కట్టండి.. ఆ తర్వాతే స్టాక్ తీసుకెళ్లండి: అప్పుపై పెట్రోల్ డీజిల్ సరఫరా బంద్

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ సెగలు భారత్‌లోని పెట్రోల్ బంకులను చేరాయి. ఇన్నాళ్లూ డీలర్లకు అప్పుపై ఇంధనాన్ని సరఫరా చేసిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఇప్పుడు తమ రూటు మార్చాయి. ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు పేమెంట్ రూల్స్ అత్యంత కఠినతరం చేశాయి.

గతవారం నుంచే బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తేనే స్టాక్ పంపిస్తామని స్పష్టం చేయగా.. తాజాగా సోమవారం నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తన 5 రోజుల క్రెడిట్ పాలసీని రద్దు చేసేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు లక్ష పెట్రోల్ బంకులపై నేరుగా ప్రభావం పడనుంది. గతంలో డీలర్లకు ఉన్న రివాల్వింగ్ క్రెడిట్, డ్రాఫ్ట్ ఆన్ డెలివరీ వంటి సదుపాయాలను ఆయిల్ సంస్థలు నిలిపివేసి, కేవలం బ్యాంక్ గ్యారెంటీతో కూడిన ఎలక్ట్రానిక్ డీలర్ ఫైనాన్స్‌ను మాత్రమే కొనసాగిస్తున్నారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత్‌కు అందే చమురులో దాదాపు 40 శాతం మేర సరఫరా మార్గాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో రిస్క్ తగ్గించుకోవడానికి, ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకోవడానికి ఆయిల్ కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయని నిపుణులు అంటున్నారు. అప్పు ఇచ్చే వెసులుబాటు పోవడంతో, ఇకపై డీలర్లు ముందస్తుగా నగదు చెల్లించి స్టాక్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రిటైల్ వ్యాపారులే కాకుండా.. క్రెడిట్‌పై ఆధారపడే రవాణా, వ్యవసాయ రంగాలకు చెందిన బల్క్ బయ్యర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. 

అయితే ఈ కఠిన నిబంధనల వల్ల సామాన్యులకు పెట్రోల్ కొరత ఏర్పడుతుందా అంటే.. ప్రస్తుతానికి అలాంటి ప్రమాదమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, అవసరమైన మేర స్టాక్ అందుబాటులో ఉందని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. స్టాక్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం పేమెంట్ పద్ధతుల్లో మాత్రమే మార్పులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.