
- బయటి వ్యక్తులతో తిట్టిస్తున్నడు.. మా జాగృతిలో కోవర్టులను పెట్టిండు
- నా ముందు చావు తెలివితేటలు ప్రదర్శించొద్దు: కవిత
- ఓ లిల్లీపుట్ నాయకుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్తున్నడు
- ఆయనే నల్గొండలో పార్టీని సర్వనాశనం చేసిండు
- ఇష్టమున్నట్లు మాట్లాడ్తే తీవ్ర పరిణామాలు తప్పవ్
- నా లేఖ లీకవ్వడానికి, ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలకు సంబంధం ఉంది
- టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తయని వ్యాఖ్య
- బీసీ రిజర్వేషన్లపై తమ దీక్షకు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆడబిడ్డనైన తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారని, కానీ, ఇప్పటివరకూ బీఆర్ఎస్ స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తనపై పార్టీ పెద్ద నేత ఒకరు కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నా పైన కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉంది. అందుకే కొందరు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నరు. వేరే పార్టీ లీడర్లతోనూ మాట్లాడిస్తున్నరు. నేను భయపడే వ్యక్తిని కాదు. తెలంగాణ కోసమే కొట్లాడిన. మీ చావు తెలివి తేటలు నా ముందు ప్రదర్శించొద్దు’’ అని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో ఓ లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడని, తనపై ఆయన ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని హెచ్చరించారు.తాను తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయన్నారు.
తీవ్ర పరిణామాలుంటయ్.. జాగ్రత్త!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కారణం ఆ జిల్లాకు చెందిన లిల్లీపుట్ నాయకుడే కారణమని కవిత మండిపడ్డారు. ‘‘11 నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణం. ఆయన కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిచిండు. ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నల్గొండ జిల్లా మాజీ మంత్రి అయిన ఆయన కేసీఆర్ లేకపోతే అసలు లేడనే విషయం గుర్తుంచుకుంటే మంచిది. ఉద్యమంలో లేని నాయకులు కూడా నాపై విమర్శలు చేయడం హాస్సాస్పదం. నా గురించి ఇంకోసారి ఇష్టమున్నట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటయ్” అని ఆమె హెచ్చరించారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు తెలియదని కవిత అన్నారు.
‘‘ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్‌కు నేను రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉంది. ఆరు నెలల్లో రమేశ్ ఎప్పుడూ స్పందించలేదు” అని పేర్కొన్నారు. కాగా, ఉద్యమంలో లేని కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి పదవులు పొందారని సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మండిపడ్డారు. ‘‘అసలు వాళ్లు ఉద్యమంలో ఎక్కడున్నరు? నువ్వో చిన్న పిల్లాడివని తెలుసుకొని మాట్లాడితే మంచిది” అని వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసే అలవాటు వారికే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేటోళ్లే తనకు ప్రభుత్వంతో సంబంధం ఉందని అంటే ఎలా అని ప్రశ్నించారు. తనను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆమె అన్నారు.
అనుమతివ్వకపోతే ఇంట్లోనే దీక్ష
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నిరాహారదీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకుంటే ఇంట్లోనే దీక్ష చేస్తానని కవిత స్పష్టం చేశారు. అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా గాంధేయ మార్గంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సోమవారం నుంచి 72 గంటలు దీక్ష చేయడానికి నిర్ణయించామన్నారు. తమ దీక్షకు ప్రభుత్వం అనుమతివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీల్లో 112 కులాలున్నాయని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతిరోజూ 40 కులాలు మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే 72 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమయ్యామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఆర్డినెన్స్‌పై సరైన నిర్ణయం తీసుకోని బీజేపీనే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆమె మండిపడ్డారు.
జాగృతిలో కోవర్టులను పెట్టిండు
బీఆర్ఎస్లోని ముఖ్య నాయకుడు ఒకరు తెలంగాణ జాగృతిలో కోవర్టులను పెట్టి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ‘‘ఆ ముఖ్య నాయకుడికి చెప్తున్నా.. పార్టీలోనూ నా మనుషులూ ఉన్నారు. చావు తెలివితేటలు నా వద్ద ప్రదర్శించొద్దు. పార్టీలో ఏం జరుగుతున్నదో కూడా నాకు తెలుసు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై దాడి జరుగుతున్నది. ఆ దాడిపై కూడా ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే పార్టీ నేతలెవరూ స్పందించడం లేదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి. దేవుడనే వాడున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు గట్టిగానే తిరిగి కొడ్తడు” అని ఆమె హెచ్చరించారు.