పరేడ్​ గ్రౌండ్​లో ఇంటర్నేషనల్​​ కైట్ ​అండ్ ​స్వీట్ ​ఫెస్టివల్ షురూ

పరేడ్​ గ్రౌండ్​లో ఇంటర్నేషనల్​​ కైట్ ​అండ్ ​స్వీట్ ​ఫెస్టివల్ షురూ
  •     పరేడ్​ గ్రౌండ్​లో ఇంటర్నేషనల్​​ కైట్ ​అండ్ ​స్వీట్ ​ఫెస్టివల్ షురూ​
  •     ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్​

సికింద్రాబాద్, వెలుగు: ఇటు స్వీట్లు.. అటు కైట్ల కోలాహలం మధ్య సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో శనివారం ఇంటర్నేషనల్ కైట్​అండ్ ​స్వీట్​ఫెస్టివల్​అట్టహాసంగా మొదలైంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను మంత్రులు జూపాల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్ ​ప్రారంభించారు. శనివారం నుంచి ఈ నెల15 వరకు మూడు రోజుల పాటు జరిగే.. ఈ కైట్ ఫెస్టివల్ లో అమెరికా, కెనడా, కంబోడియా, స్వీడన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సహా16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది ప్లేయర్లు  పాల్గొంటున్నారు.

పతంగుల పండుగతో పాటు నిర్వహిస్తున్న స్వీట్ ఫెస్టివల్ లో 400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లను ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శిస్తున్నారు. హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు  చేశారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు దాదాపు15 లక్షల మంది హాజరవుతారని అంచనా.

ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తున్న  హైదరాబాద్​

భిన్న సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో హైదరాబాద్ మహానగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపాల్లి కృష్ణా రావు అన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్​లో  ప్రత్యేకమైన వాతావరణం ఉంటుందన్నారు. ఇప్పటికే ఐటీ హబ్, బహుళ జాతి సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హైదరాబాద్.. ఎన్నో అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ  పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పరేడ్​గ్రౌండ్​లో కైట్​ఫెస్టివల్​ప్రారంభించిన తర్వాత.. మంత్రులు జూపాల్లి, పొన్నం కళాకారులతో కలిసి డ్యాన్సులు చేశారు. స్వీట్, చేనేత వస్ర్తాల స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ  డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.