తెలంగాణలో 9,877 బడుల్లోనే ఇంటర్నెట్

తెలంగాణలో 9,877 బడుల్లోనే ఇంటర్నెట్
  •     డిజిటల్ లైబ్రరీలు 772 స్కూళ్లలోనే 
  •     5 వేలకు పైగా బడుల్లో  తాగునీటికి ఇబ్బందే 
  •     2021-22 యూడైస్​ లెక్కల్లో బహిర్గతం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లలో ఫెలిసిటీస్​పెద్దగా కనిపించడం లేదు. మొత్తం 43,083 స్కూళ్లుండగా, వాటిలో కేవలం 9,877 బడుల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. దీంతో కొన్ని స్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నా, అవి నిరుపయోగంగానే మారాయి. దేశమంతా డిజిటల్ యుగం వైపు పరిగెడుతుంటే, తెలంగాణ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే కొనసాగుతోంది. బడుల్లోని వసతులపై కేంద్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్​ ప్లస్​ రిపోర్టును రిలీజ్ చేసింది. తెలంగాణ స్టేట్​లో 30,023 సర్కారు స్కూల్స్ ఉంటే 2,772 బడుల్లో, ఎయిడెడ్​లో 700 స్కూల్స్ ఉంటే 188, ప్రైవేటు బడులు 12,193 ఉంటే, 6,917 బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది.

మరోపక్క డిజిటల్ లైబ్రరీలు కూడా స్టేట్​ వైడ్​గా కేవలం 772 బడుల్లోనే ఉన్నాయి. వీటిలో 236 సర్కారు, 6 ఎయిడెడ్, 526 ప్రైవేటు స్కూల్స్​తో పాటు మరో 4 బడుల్లో ఉన్నాయి. లైబ్రరీ బుక్ బ్యాంక్ 39,510 బడుల్లో, కిచెన్​ గార్డెన్స్ 4,298, సోలార్ ప్యానెల్స్​ 2,011 బడుల్లో ఉన్నాయి. ఎలక్ర్టిసిటీ సౌకర్యం 40,437 బడుల్లో ఉన్నా, 38,920 స్కూళ్లలోనే ఫంక్షనింగ్​లో ఉన్నది. డ్రింకింగ్ వాటర్ 41,105 స్కూళ్లలో ఉన్నట్టు చెప్తున్నా, 37,221 బడుల్లోనే ఫంక్షనింగ్ అవుతున్నాయని నివేదిక చెప్తుంది. ఈ లెక్కన అధికారికంగానే 5,862 బడుల్లో తాగేందుకు నీళ్లు లేవు.  గతేడాది కేవలం 28,747 బడుల్లోనే స్టూడెంట్లకు మెడికల్  చెకప్​లు నిర్వహించారు.  బాయ్స్​కు 34,643 బడుల్లో టాయ్ లెట్లు ఉన్నా, 29,137 స్కూళ్లలోనే ఫంక్షనింగ్​లో ఉన్నాయి. గర్ల్స్​కు 38,802 బడుల్లో ఉన్నా, 33,428 స్కూల్స్​లో నడుస్తున్నాయి. బడుల్లో ఫెసిలిటీస్​ కల్పించడంలో తెలంగాణ సర్కారు మరింత కృషి చేయాలని  ఈ లెక్కల ద్వారా కేంద్రం సూచించింది.