- ఈ ఏడాది ఇప్పటిదాకా 51సార్లు బంద్
- 2016 నుంచి 2023 మధ్య 771 సార్లు షట్‌డౌన్
- ఇతర దేశాలతో పోల్చితే ఇండియానే టాప్
- డిజిటల్ రైట్స్ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ డేటా వెల్లడి
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే ఇంటర్నెట్ షట్‌డౌన్ సమస్య ఎక్కువగా ఉంది. 2016 నుంచి 2023 మధ్య భారత ప్రభుత్వం ఏకంగా 771 సార్లు అకస్మాత్తుగా ఇంటర్నెట్ బంద్ చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకే దాదాపు 51సార్లు షట్‌డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని డిజిటల్ రైట్స్ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ వెల్లడించిన డేటా తెలిపింది. ఏదో జరిగిపోతోందనే భయంతో అనవసరంగా తరచూ కావాలనే ఇంటర్నెట్ బంద్ చేస్తున్నారని వెల్లడించింది.
డేటా ప్రకారం..దాదాపు దశాబ్ద కాలంగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో భారతదేశం టాప్ ప్లేస్ లో ఉంది. 2016 నుంచి 2023 మధ్య771 సార్లు నెట్ షట్‌డౌన్ అయ్యింది. దేశంలో ఎక్కువగా జమ్మూకాశ్మీర్‌లోనే ఎక్కువ రోజులు షట్‌డౌన్ అమలు చేశారు. 2019 నుంచి ఏకంగా 552 రోజులపాటు ఇంటర్నెట్ బంద్ చేశారు. ఇదే ప్రపంచంలోనే అతి ఎక్కువకాలం కొనసాగిన షట్‌డౌన్ గా రికార్డుకెక్కింది. గతేడాది దేశంలో 116 సార్లు ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 51సార్లు నెట్ బంద్ చేశారు. ఈ గణంకాలను ప్రకారం కనెక్టివిటీలో దేశం రోజురోజుకూ దిగజారుతున్నదని తెలుస్తున్నది.
చైనా , ఉత్తర కొరియా బెటర్
చైనా , ఉత్తర కొరియా, రష్యా వంటి నిరంకుశ పాలన కొనసాగుతున్న దేశాల్లో ఇంటర్నెట్ నిరంతరాయంగా కొనసాగుతున్నది. క్రమపద్ధతిలో సెన్సార్ చేయడంతోపాటు పర్యవేక్షణ కూడా మెరుగ్గా ఉంది. మయన్మార్, ఉక్రెయిన్ దేశాలు 2023, 2022లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయి. ఇరాన్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో సంఘర్షణలు జరుగుతున్నా ఆయా ప్రభుత్వాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ అమలు చేయలేదు. కానీ ప్రజాస్వామ్య దేశమైన మన దేశం 2023, 2022లో టాప్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఇండియా గణాంకాలకు దూరంగా ఉండటం గమనార్హం.
ప్రతికూల ప్రభావమే ఎక్కువ: శ్రుతి నారాయణ్
ఇంటర్నెట్ షట్‌డౌన్ వల్ల ప్రయోజనాల కన్నా ప్రతికూల ప్రభావమే ఎక్కువున్నదని ఐక్యరాజ్యసమితి తెలిపినట్లు యాక్సెస్ నౌకి చెందిన ఆసియా పసిఫిక్ పాలసీ కౌన్సెల్ శ్రుతి నారాయణ్ వెల్లడించారు. "ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రాథమిక మానవ హక్కుగా పరిగణించబడింది. నెట్ బ్లాక్‌అవుట్‌లు విద్య, ఉద్యోగాలు, సామాజిక సేవలపై ప్రతికూల ప్రభావితం చూపిస్తాయి. ఇంటర్నెట్ షట్‌డౌన్ సమాచార వ్యాప్తిని ఆపేస్తుంది. దాని వల్ల అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది" అని శ్రుతి నారాయణ్ పేర్కొన్నారు.
మన దేశంలో ఎక్కువెందుకు..?
డిజిటల్ రైట్స్ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ డేటా ప్రకారం..మన దేశంలోనే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ అమలయ్యింది. దేశంలో ఆందోళనలు, నిరసనలు ఎక్కువగా జరుగుతున్నందునా...వాటిని అణిచివేయడానికి వేరే మార్గాలు లేక ఇంటర్నెట్ షట్‌డౌన్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చెబుతున్నది. ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ లో ఇటీవల ఐదు రోజుల ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను అమలు చేశారు. అలాగే..పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను నియంత్రించడానికి, రైతుల నిరసనలను అణిచివేసేందుకు, ఎగ్జామ్స్ టైమ్ లో మోసాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేస్తున్నాయి.