
- వంద మీటర్ల దూరంలోనే
- ఓ చోట వాన.. మరో చోట ఎండ
- ఈ ఏడాది అల్పపీడనాలు,
- వాయుగుండాలతో పడిన వర్షాలు తక్కువే
- లోకల్‌గా ఏర్పడిన మార్పుల వల్లే ఎక్కువ వర్షాలు
- చెరువులు కనుమరుగు కావడం, హైరైజ్
- బిల్డింగులు పెరిగిపోవడంతోనే చేంజెస్
- భవిష్యత్తులో ఇలాగే ఉంటే మరిన్ని
- భారీ వర్షాలు ఉంటాయని ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: పొద్దునంతా ఎండ.. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాన! రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్ వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడుతున్నాయి. గత నెల 14, 17వ తేదీల్లో కురిసిన కుంభవృష్టి వర్షానికి రోడ్లన్నీ చెరువులయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబర్17న కేవలం మూడు గంటల్లోనే దాదాపు 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అంతేకాదు.. వంద మీటర్ల దూరంలో వాన పడితే.. ఆ పక్కనే ఎండ కొడ్తున్నది. దీనికంతటికీ కారణం.. సిటీలో మైక్రో క్లైమేట్ చేంజ్ కావడమే! హైదరాబాద్‌లో చాలా వేగంగా మైక్రో క్లైమేట్పరిస్థితులు మారిపోతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితుల వల్లే సిటీలో అయితే కుంభవృష్టి లేదంటే అనావృష్టి అనే రీతిలో వర్షపాతం ఉంటున్నదని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సిటీలో మరిన్ని ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక పరిస్థితులతోనే వర్షాలు..
ఈ ఏడాది హైదరాబాద్లోస్థానికంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, వ్యవస్థల వల్లే అధిక వర్షాలు పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మామూలుగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలతో వర్షాలు పడుతుంటాయి. కానీ, ఈసారి మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువగా అల్పపీడనాలు గానీ, వాయుగుండాలు గానీ ఏర్పడలేదు. సిటీలో పొద్దునంతా తీవ్రమైన ఎండ కొట్టడం, సాయంత్రం కాగానే నల్లటి మబ్బులు కమ్మేసి వర్షాలు పడడమే ఎక్కువ సార్లు జరిగింది.
అంటే అప్పటిదాకా ఏర్పడిన వేడిగాలి, సాయంత్రం వచ్చే చల్లటి గాలులు కలిసి క్యుములోనింబస్మేఘాలు కమ్మేసి వర్షాలు పడ్డాయే తప్ప.. మాన్సూన్ప్రభావంతో కురిసిన వర్షాలు తక్కువేనని ఎక్స్పర్ట్స్చెబుతున్నారు. ఇదంతా కూడా వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులు, పరిణామాల వల్లేనని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైక్రో క్లైమేట్‌లో మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు.
ఏంటీ మైక్రో క్లైమేట్?
ఏండ్ల తరబడి ఒక ప్రాంతం (దేశం లేదా రాష్ట్రం)లో ఉండే నిర్దిష్టమైన వాతావరణ పరిస్థితులను క్లైమేట్అంటారు. అయితే దేశం లేదా రాష్ట్రంలోని నగరాలు, వివిధ పట్టణాలకంటూ ప్రత్యేకంగా ఒక క్లైమేట్ఉంటుంది. దానినే మైక్రో క్లైమేట్ అంటారు. ఉదాహరణకు హైదరాబాద్‌నే తీసుకుంటే.. డెక్కన్ పీఠభూమిపై ఉండడం వల్ల ప్రత్యేకమైన అట్మాస్ఫెరిక్లక్షణాలు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ను లేక్ సిటీ అని పిలిచేవారు. కారణం.. సిటీ అంతటా ఎక్కడా చూసినా చెరువులుండేవి. దీంతో ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులుండేవి.
చెరువులు ఎక్కువగా ఉండడం వల్ల భూమితో పోలిస్తే.. వాటర్బాడీస్వేడెక్కడం చాలా నెమ్మదిగా జరుగుతుంటుంది. ఫలితంగా వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో సిటీల్లో హైరైజ్డ్ బిల్డింగులూ క్లైమేట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. ఎత్తయిన బిల్డింగులు గాలి ప్రవాహ/ప్రయాణ (విండ్కరెంట్)ను ప్రభావితం చేస్తాయి. అంతేగాకుండా సిటీలు కాంక్రీట్జంగిల్లా మారడం వల్ల ఇటు వేడిని గానీ, అటు చల్లదనాన్ని గానీ ఎక్కువగా, వేగంగా గ్రహిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులనే ‘మైక్రో క్లైమేట్’ అంటారు.
హైదరాబాద్‌లో ఎందుకు మారుతున్నది?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. హైరైజ్డ్ బిల్డింగులు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. ఈ పదేండ్లలోనే కబ్జాలు, అభివృద్ధి పేరిట దాదాపు 70% చెరువులు కనుమరుగైపోయాయి. ఫలితంగా కర్బన ఉద్గారాలను శోషించుకునే మార్గం లేకుండా పోయింది. దీంతో ఆ వేడంతా భూమిలోకే పోతున్నది. అది బయటకు రిఫ్లెక్ట్అవుతున్నది. హైరైజ్డ్ బిల్డింగుల వల్ల గాలుల దిశ మారుతున్నది.
దీంతో సిటీలో ఒకప్పుడు ఉన్న వెదర్.. ఇప్పుడు ఉండడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చెరువులు కనుమరుగు కావడం, బిల్డింగులు పెరిగిపోతుండడంతో హైదరాబాద్ క్లైమేట్ మారుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డెవలప్మెంట్ఇక్కడితో ఆగేది కాదని, సిటీలోని మైక్రో క్లైమేట్‌లో మార్పులు రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే.. సెప్టెంబర్17 నాటి తీవ్రమైన వర్షపాతాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
గ్రౌండ్ వాటర్ పెరగట్లే..
సిటీలో భారీ వర్షపాతం నమోదైనా గ్రౌండ్‌వాటర్ మాత్రం పెరగట్లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి కుంభవృష్టి కురవడం, వరద భూమిలోకి ఇంకకపోవడం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. జూన్, జులైలో సిటీలో లోటు వర్షపాతమే రికార్డయింది. 29.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 26.7 సెంటీమీటర్లే రికార్డయింది. కానీ, ఆగస్టులో మాత్రం 36.3 సెంటీమీటర్లకు గాను 49.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
అందులో ఎక్కువ మొత్తం కేవలం వారంలో కురిసిన కుంభవృష్టి ఫలితమే. అయితే, కాంక్రీట్జంగిల్లా సిటీ మారడంతో ఎక్కడా వరద నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లోనూ గ్రౌండ్‌వాటర్ రీచార్జ్అయ్యే పరిస్థితులు లేకుండా పోయాయి. జీహెచ్‌ఎంసీ లిమిట్స్‌లోని మేడ్చల్మల్కాజిగిరి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, అల్వాల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు సాధారణం కన్నా అడుగున ఉండిపోయాయి. ఇప్పటికీ సగటున 50 అడుగుల లోతులోనే నీళ్లు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనమని ఎక్స్‌పర్ట్స్ వివరిస్తున్నారు.