
తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. అందాల హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ఓరచూపులకు బౌల్డ్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ‘మా ఇద్దరి మధ్యా లవ్ లేదని’ అనుపమ పరమేశ్వర్ వివరణ ఇచ్చింది.
ఇద్దరు మహిళలతో క్రికెట్ కోచ్ రవిశాస్త్రి దిగిన ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు దాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా పొలిటీషియన్స్, సినిమా వాళ్లు, స్పోర్ట్స్ పర్సన్స్.. నెట్టింట్లో ట్రోల్ కావడం మామూలే.
కానీ ఈ ట్రోలింగ్ కేవలం నెట్టింట్లోనే కాదు మన చుట్టుపక్కల కూడా జరుగుతుంది.
మనకు తెలియకుండా మనమే మరొకర్ని ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. లేదా మన గురించి మరొకరు ట్రోల్ చేయొచ్చు. దీని వెనక మనిషి బలహీనతలుంటాయి. బయటకు చెప్పుకోలేని లోపాలుంటాయి. ట్రోలింగ్ చేసేవాళ్ల కథా కమామిషు ఏంటో తెలియాలంటే.. దీని వైపు ఓ లుక్ వేయండి.
లోపాలు కప్పిపుచ్చుకోవడానికి..
లోపాలు కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పులు బయటపడకుండా ఉండటానికి కొందరు మరొకరి గురించి ట్రోల్ చేస్తుంటారు. తమ తప్పులు ఎక్కడ బయటపెడతారో అని.. ముందుగా వాళ్ల గురించి చెడుగా ట్రోల్ చేయడం మొదలుపెడతారు. మానసికంగా దెబ్బతీసి అందరి ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. దాంతో ఎదుటి వాళ్ల పరువుపోతుంది. ఒక విషయం గురించి పదేపదే చెప్పడం వల్ల మనసులో నాటుకుపోయి దాన్నే నిజమని నమ్మే అవకాశం లేకపోలేదు. అందుకే ట్రోల్ చేసేవాళ్లు ఒక విషయాన్ని పదేపదే చెప్తారు. అలాగని ఒకరికి చెప్పి వదిలేయరు, ఎవరెవరికి చెప్పడం వల్ల ఎదుటి వాళ్ల వ్యక్తిత్వం దెబ్బతింటుందో అలాంటి వాళ్లందరికీ చెప్తారు. దాంతో తప్పుచేసినా హాయిగా ఉంటారు. మరొకరికి తెలియకుండా రహస్యంగా చెప్పడం, ఎక్కువమంది ఉన్నప్పుడు సైతం ఒక్కరికే అర్థమయ్యేలా సైగలు చేయడం. అవసరం అయితే పెద్దగా అరిచి మాట్లాడటం లాంటివన్నీ ట్రోల్ చేసేందుకు వాడుకునే ఎత్తుగడలే.
ఎంజాయ్ కోసం
ట్రోల్ చేసేవాళ్లను. ‘ఎందుకు చేస్తున్నావ్ అనవసరంగా?’ అంటే ‘జస్ట్ ఎంజాయ్’ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అవసరాలు ఏం ఉండవు. ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతారు. అలాగని వీళ్ల ట్రోల్‌కు హద్దుపద్దూ ఉండదు. ఫ్రెండ్స్ నుంచి పై అధికారుల వరకు.. ఇంట్లో వాళ్ల నుంచి సొసైటీలో పేరున్న వ్యక్తుల వరకు.. ఎవర్నైనా ట్రోల్ చేస్తారు. అదే వీళ్ల గురించి ఒక్క చెడు మాట అన్నా తట్టుకోలేరు. వెంటనే కక్షసాధింపు చర్యలతో ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఇలాంటి వాళ్లకు ఆత్మన్యూనత ఎక్కువ. అప్పటివరకు కలిసి మాట్లాడిన ఫ్రెండ్ పక్కకు పోగానే.. అతడి గురించి ఏం తెలియక పోయినా బ్యాడ్‌గా చెప్పి నవ్వుతారు. అదేమంటే ‘మై హాబీ’ అని గొప్పగా చెప్పుకుంటారు. మరోవైపు పెద్దవాళ్ల దగ్గర మర్యాద నటిస్తారు. వాళ్లనుంచి దూరంగా రాగానే భరించలేనంతగా వాళ్లనే ట్రోల్ చేసి సంతోషిస్తారు. ఇదంతా కేవలం ఎంజాయ్ అనే ముసుగేసుకుని తమలోని అహాన్ని తృప్తి పరుచుకుంటుంటారు.
దెబ్బతీయడం కోసం..
ఇన్‌మెచ్యూర్, సైకోటిక్ మెకానిజమ్ ఉన్న వాళ్లు కూడా ఇతరుల గురించి ట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు వాస్తవాన్ని గుర్తించరు. ఎదుటి వాళ్ల మీద అపవాదులేస్తారు. బ్లేమ్ చేస్తూ సంతోషిస్తుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా కోరుకుంటారు. ఎదిగీ ఎదగని మనసుతో అన్నీ నాకు తెలుసు అనుకుంటుంటారు. తమకంటే ఎవరన్నా ముందు ఉంటే తట్టుకోలేరు. ఏదో ఒకవిధంగా వాళ్లను ట్రోల్ చేసి బ్యాడ్ చేస్తారు. దాంతో తృప్తి పొందుతారు. మాటలతో మరొకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ శాడిస్ట్‌లా ప్రవర్తిస్తారు. అలాగని వాళ్లకు తెలియదనుకోకూడదు. అంతా తెలిసే చేస్తారు. వంకరనవ్వులు. విపరీతమైన అహంకారంతో గొప్పవాళ్లను కూడా ‘వాళ్లెంత.. వీళ్లెంత?’ అని మాట్లాడేస్తారు. అదే సమయంలో వాళ్లకు తెలుస్తుందేమోనన్న భయం వీళ్లను వెంటాడుతూ ఉంటుంది. అందుకే నమ్మకస్తులైన వాళ్ల దగ్గరే వీళ్లు ట్రోల్ చేస్తుంటారు.
తట్టుకోలేకపోవడం
తోటివాళ్ల ఎదుగుదలను జీర్ణించుకోలేక, తమ తక్కువను తట్టుకోలేక కొందరు ట్రోల్ చేస్తుంటారు. దీనినే డిఫెన్స్ మెంటాలిటీ అంటారు. ‘వాళ్లకంటే నేను చాలా తెలివిగల వాడ్ని. నన్ను మోసం చేశాడు. వాడు చాలా తప్పులు చేశాడు’ అని ఆత్మ సంతృప్తికోసం వాళ్లలో ఉన్న చిన్నచిన్న లోపాలను ఎక్కువ మందికి ట్రోలింగ్‌తో చేరవేస్తారు. తను ఎదగలేకపోవడాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారు. వాళ్లను వాళ్లు కాపాడుకుంటూ, ఎదుటి వాళ్లను ఎందుకూ పనికిరాని వాళ్లుగా చేయాలనుకునే మెంటాలిటి. ఇలా ట్రోల్ చేసేవాళ్లు ఎదుటివాళ్ల మంచితనాన్ని కూడా చెడుగా మార్చి ట్రోల్ చేస్తారు. తమను తాము గొప్పగా ఊహించుకుంటారు. ఉన్నవి లేనివి, తెలిసినవి తెలియనివి.. అన్నీ ట్రోల్ చేస్తుంటారు. తమను తాము ఎందులోనూ తక్కువకాదు అని నిరూపించడం కోసం గొప్పలకు పోతుంటారు. పై స్థాయిలో ఉన్న వాళ్ల గురించి ట్రోల్ చేస్తూ, వాళ్లలోని సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటారు.
సైకిక్ సమస్య
ఇతరుల గురించి ట్రోల్ చేసేవాళ్లలో కొందరు మానసికమైన సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నప్పుడు జరగకూడని సంఘటనలు వాళ్ల జీవితాల్లో జరిగి ఉండవచ్చు.ఇష్టమైన వ్యక్తులను కోల్పోయి ఉండొచ్చు. నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుండొచ్చు. అలాగే భయం, ఒంటరితనం లాంటి వాటితో ఎక్కువ కాలం నుంచి ఇబ్బంది పడుతుండొచ్చు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఇతరుల్లోని మంచైనా, చెడైనా తట్టుకోలేరు. అలాగని వాళ్లతో ఎదురుగా మాట్లాడే ధైర్యం ఉండదు. దాంతో వాళ్లు లేనప్పుడు ఇతరులతో వీళ్లలోని లోపాలన్నింటిని వాళ్లకు అంటగట్టి మాట్లాడుతుంటారు. అసహ్య పదజాలాన్ని వాళ్ల మీద ప్రయోగించి మాటలతో తృప్తి పొందుతారు. ఇలా మానసికంగా ఆనందం పొందేవాళ్లను మానసిక వైద్యులకు చూపించాలి.
నష్టాలెన్నో
ట్రోలింగ్ వల్ల పెద్దగా ప్రమాదం లేదు అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియాలో, వ్యక్తుల మధ్య చెడుగా ఒక విషయం వైరల్ అయిందంటే.. ఆ విషయం ఎవరికి సంబంధించిందో వాళ్లు శారీరకంగా నష్టపోకపోవచ్చు. కానీ, అంతకుమించి మానసికహింసకు గురవుతారు. లోలోపల కుంగిపోతారు. గుండెనిబ్బరం లేకపోతే ఆత్మహత్యలకు కూడా పాల్పడొచ్చు. అందుకే ట్రోల్‌కి గురైన వ్యక్తులు తమ గురించి తాము ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజం లేకపోతే నిర్భయంగా ఉండాలి. ఒకవేళ ట్రోల్ అయిన విషయం నిజం అయితే లోపాలు దిద్దుకోవాలి. ఎదుటి వాళ్లను ట్రోల్ చేయడం ఒక మానసిక రోగం. ముందుగా దాన్నుంచి బయటపడాలి. కుదరకపోతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.